ప్రభాస్.. ఒకసారి షారుఖ్‌ను చూడమ్మా

 ప్రభాస్.. ఒకసారి షారుఖ్‌ను చూడమ్మా

ప్రభాస్ కొత్త సినిమా ‘సాహో’లో ఒక యాక్షన్ ఎపిసోడ్‌కు రూ.90 కోట్లకు పైగా ఖర్చు పెట్టారట. ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లకు పైనే అట. ముందు ఈ చిత్రాన్ని రూ.50 కోట్లతో తీయాలనుకున్నారట. ఇప్పుడు బడ్జెట్ నాలుగు రెట్లకు పైగా పెరిగిందట. ‘సాహో’ తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా బడ్జెట్ రూ.150 కోట్లట. ఈ సినిమా కోసం వేసిన ఒక్క సెట్టింగ్‌కే రూ.30 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఇలాంటి వార్తలు గత కొన్ని నెలల్లో ఎన్నో చూస్తున్నాం. ఐతే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ మార్కెట్ ఎంతగా పెరిగినప్పటికీ.. ఇంత డాబు అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఒక హీరో మార్కెట్ రూ.100 కోట్లు ఉందని అనుకుంటే.. వంద కోట్లు పెట్టి సినిమా తీసేస్తే ఏముంది గొప్ప? యాభై కోట్లలో సినిమా తీసి వంద కోట్లకు మార్కెట్ చేసి.. పెట్టుబడి మీద రెట్టింపు ఆదాయం సంపాదించడం అన్నది తెలివైన పని. కానీ మన ఫిలిం మేకర్స్ తీరు ఇలా ఉండదు. మార్కెట్ పెరిగింది కదా అని ఆ మేరకు బడ్జెట్లు పెంచేస్తారు. అయినకాడికి ఖర్చు పెట్టిస్తారు. పారితోషకాలూ అలాగే ఇస్తారు. మొత్తంగా బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. ఇలా అయినకాడికి బడ్జెట్లు పెరగడం వల్ల పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ల సినిమాలు ఎలా బయ్యర్లను ముంచేశాయో.. నష్టాల్లో ఎలా రికార్డులు బద్దలు కొట్టాయో చూశాం. ఐతే ‘బాహుబలి’తో వాళ్లను మించిన స్టార్ అయ్యేసరికి ప్రభాస్ మీద కూడా అయినకాడికి ఖర్చు పెట్టేస్తున్నారు.

ఐతే నిజంగా ప్రభాస్ సినిమాలకు ఇంత హంగామా అవసరమా? ప్రభాస్ మార్కెట్ పెరిగింది కదా అని బడాయి పోతూ సెట్టింగ్స్ వేయడం, యాక్షన్ ఎపిసోడ్ల కోసం అంతేసి ఖర్చు పెట్టడం అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘బాహుబలి’తో పేరొచ్చింది కదా అని అతి చేస్తే అంతే సంగతులు. ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన షారుఖ్ ఖాన్.. ఇప్పుడు ఏ స్థితికి చేరుకున్నాడో తెలిసిందే. ఫాలోయింగ్ దెబ్బ తింది. మార్కెట్ మొత్తం కరిగిపోయింది. ఈ మధ్య అతడి సినిమాలు రూ.50 కోట్ల వసూళ్ల దగ్గర ఆగిపోతున్నాయి. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మరీ మిడిసిపడితే.. అతి చేస్తే మొదటికే మోసం వస్తుంది. రెండు సినిమాలు వరుసగా బోల్తా కొడితే మార్కెట్ అంతా ఎగిరిపోతుంది. ఈ విషయం గ్రహించి ప్రభాస్ తన సినిమాల బడ్జెట్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English