అప్పుడెలా ఒప్పుకుంటావ్‌లే కాజల్

అప్పుడెలా ఒప్పుకుంటావ్‌లే కాజల్

టాలీవుడ్లో ఒకప్పుడు కాజల్ అగర్వాల్‌ది తిరుగులేని స్థాయి. చిన్న, మీడియం రేంజి హీరోలు, దర్శకులు, నిర్మాతలకు ఆమె అస్సలు దొరికేది కాదు. ఇటు తెలుగులో అయినా, అటు తమిళంలో అయినా పెద్ద పెద్ద స్టార్లతోనే నటించేది చందమామ. అలాంటి సమయంలో తేజ వచ్చి తన దర్శకత్వంలో సినిమా చేయమంటే కాజల్ ఎలా ఒప్పుకుంటుంది? ఒప్పుకోలేదట. ఇప్పుడామె ప్రధాన పాత్రలో తేజ రూపొందించిన ‘సీత’ కథను ఆమె చాలా ఏళ్ల కిందటే విందట. కానీ అప్పుడు ఆ సినిమా చేయలేకపోయానని చెప్పింది కాజల్.

కొన్నేళ్ల కిందట అంటే తేజ ఎలాంటి ఫాంలో ఉన్నాడో తెలిసిందే. పైగా కాజల్ రేంజ్ అప్పటికి ఎక్కువ. దీంతో ఆమె ‘సీత’ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు లేదు. తన కెరీర్ కొంచెం గాడి తప్పి.. స్టార్ల సరసన అవకాశాలు తగ్గాక తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేయడానికి ముందుకొచ్చింది. అది కూడా ‘బాహుబలి’తో మాంచి క్రేజ్ తెచ్చుకున్న రానా దగ్గుబాటి అందులో హీరో, సురేష్ బాబు నిర్మాత కాబట్టి. ఆ సినిమా సక్సెస్ కావడంతో ‘సీత’ చేయడానికి ముందుకొచ్చిందని అనుకోవాలి.

ఇప్పుడు కాజల్ కెరీర్ ఎలా ఉందో కూడా అందరికీ తెలిసిందే. పూర్తిగా స్టార్ల సినిమాలకు ఆమె దూరం అయిపోయింది. బెల్లంకొండ శ్రీనివాస్ రేంజ్ హీరోలకు పడిపోయింది. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేస్తున్నపుడు ‘సీత’ సినిమా తనతోనే చేయాలని తనే తేజకు చెప్పి మరీ ఈ చిత్రం చేసినట్లు కాజల్ చెప్పడం విశేషం. మొత్తానికి కాజల్ ఏదో తేజ మీద గురు భక్తితో ఆయన ఫామ్ గురించి పట్టించుకోకుండా వరుసగా రెండు సినిమాలు చేసేసిందని అంతా అనుకుంటున్నారు కానీ.. ఆమె లెక్కలేసుకునే తేజతో మళ్లీ జట్టు కట్టిందన్నది స్పష్టం. ఇంతకీ ‘సీత’ కాజల్‌కు ఎలాంటి ఫలితం అందిస్తుందో ఈ శుక్రవారం చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English