పరామర్శలో పరిహాసమా? జగన్ సెల్ఫీపై లోకేష్ ఫైర్

కొద్ది రోజులుగా ఏపీలోని చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలను వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. వరద బాధితులకు ప్రభుత్వ సాయం సరిగా అందడం లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక, సీఎం జగన్ హెలికాప్టర్ లో ఏరియల్ సర్వేచేసి వెళ్లిపోయారని టీడీపీ నేతలు విమర్శించారు. ఈ విమర్శలు చేసిన తర్వాత జగన్ నిన్నటి నుంచి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించడం మొదలుబెట్టారు.

అయితే, ఆ ప్రాంతాల్లో పర్యటించడానికి హెలికాప్టర్ లో వెళుతున్న సందర్భంగా జగన్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడప జిల్లాలో సర్వం కోల్పోయి సాయం కోసం ఎదురుచూస్తున్న వారిని పరామర్శించడానికి వెళుతోన్న జగన్…హెలికాప్టర్ లో చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీలు దిగడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇఖ, జగన్ స్వయంగా సెల్ఫీ తీస్తుంటే ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్ స్మైల్ ఇవ్వడంతో వారంతా ఏమన్నా ఫంక్షన్ కు వెళుతున్నారా అని టీడీపీ నేతలు దుయ్యబడుతున్నారు.

ఎవరైనా తనతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తే…సీఎం హోదాలో ఉన్న జగన్ ఇది సమయం సందర్భం కాదని సున్నితంగా తిరస్కరించాల్సింది పోయి…తానే తగుదునమ్మా అంటూ సెల్ఫీ తీయడంపై వరదబాధితులు సైతం మండిపడుతున్నారు. ఇక, జగన్ సెల్పీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో, ఈ వ్యవహారంపై  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. జ‌ల‌స‌మాధి అయిన‌ 60 మంది కుటుంబ‌స‌భ్యుల్ని ప‌రామ‌ర్శించ‌డానికి జగన్ వెళుతున్నారని, వంధిమాగ‌ధుల‌తో సెల్ఫీలు తీసుకోవ‌డానికి కాదని అన్నారు.

వేల‌కోట్ల న‌ష్టం పరిశీలించడానికి వెళ్లిన జగన్…రోప్ పార్టీలతో జనానికి దూరంగా నిలుచొని మాట్లాడుతూ…నవ్వుతూ ఫోటోలు దిగ‌డంపై కూడా లోకేష్ మండిపడ్డారు. జ‌నం బాధ‌లు అంత పైశాచిక‌ ఆనందం క‌లిగిస్తున్నాయా జగన్.. అంటూ ఫైర్ అయ్యారు. ఇక, మందపల్లె, తిరుపతిలోనూ జగన్‌ సెల్ఫీలు దిగడంపై బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విహార యాత్రకు వచ్చారా? వరద బాధితులను పరామర్శించడానికి వచ్చారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.