రాళ్లపల్లి పెద్ద కూతురి కథ వింటే కన్నీళ్లే..

రాళ్లపల్లి పెద్ద కూతురి కథ వింటే కన్నీళ్లే..

సీనియర్ నటుడు రాళ్లపల్లి నరసింహారావు మరణం సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. ఇండస్ట్రీలో ఆయన్ని అజాత శత్రువుగా పేర్కొంటారు. అందరితోనూ సఖ్యంగా ఉండి, ఎంతో గౌరవం సంపాదించుకున్న ఆయన వ్యక్తిగత జీవితంలో చాలా పెద్ద విషాదాన్ని ఎదుర్కొన్నారు. ఆయన పెద్ద కూతురు హఠాత్తుగా మరణించింది.
ఆమె మరణించిన తీరు గురించి తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఆమెను డాక్టర్ చేయాలన్నది రాళ్లపల్లి కల. అందుకోసం రష్యాకు పంపాలనుకున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ నుంచి రష్యాకు విమానం ఎక్కాల్సి ఉంది. తన కూతురిని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్లోనే పంపడానికి తగ్గ ఆర్థిక స్థోమత ఆయనకు ఉంది. కానీ స్నేహితులతో కలిసి వెళ్తానంటే రైలు ఎక్కి పంపించారు. ఆమె వెంట తన మావయ్య కూడా వెళ్లారు. కానీ ఆయన వరంగల్లో దిగిపోయారు.

మార్గ మధ్యంలో రాళ్లపల్లి కూతురికి బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. అత్యవసరంగా చికిత్స అందించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ రైల్లో ఉండటంతో వీలు కాలేదు. ఢిల్లీకి వెళ్లి చికిత్స చేయించుకోవాలనుకున్నారు. కానీ ఆగ్రాకు వెళ్లేసరికి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయిందామె. ఈ విషయం తెలిసి రాళ్లపల్లి గుండె పగిలింది. కూతురి మరణాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. ‘నీకు జన్మనిచ్చింది నేనే. నీ మరణానికి కారణమైంది కూడా నేనే’ అంటూ బోరున విలపించారు. కూతురి మరణం తర్వాత చాలా కాలం పాటు ఆయన డిప్రెషన్లో ఉన్నట్లు సన్నిహితులు చెబుతారు.

తన రెండో కూతురికి పెళ్లిచేయడం, మంచి అల్లుడు దొరికి అతను కొడుకులాగా ఆయనకు అండగా నిలవడంతో రాళ్లపల్లి మళ్లీ కాస్త కోలుకున్నారని చెబుతారు. రాళ్లపల్లి రెండో కూతురు, అల్లుడు అమెరికాలో ఉన్నారు. కూతురు ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా.. అల్లుడు ఇంకా రాలేదు. ఆయన కోసం అంత్యక్రియల్ని 20వ తేదీ వరకు ఆపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English