సూర్య అభిమానుల అతి చూశారా?

సూర్య అభిమానుల అతి చూశారా?

హీరోల పట్ల అభిమానం ఉండొచ్చు. అది పైత్యంగా మారితేనే ప్రమాదం. తమిళ అభిమానుల అతి ఎలా ఉంటుందో ఇప్పటికే చాలాసార్లు చూశాం. దక్షిణాదిన హీరోలకు భారీ కటౌట్లు పెట్టడం, పాలాభిషేకాలు చేయడం..  హీరోయిన్ల కోసం గుళ్లు కట్టడం.. లాంటి సంప్రదాయాలు మొదలుపెట్టింది తమిళ అభిమానులే. ఈ మధ్య లారెన్స్ అభిమాని ఒకరు క్రేన్ మీది నుంచి ప్రమాదకరంగా వేలాడుతూ తమ హీరో కటౌట్‌కు పాలాభిషేకం చేయడం చూసే ఉంటారు.

ఇక తమ హీరోలకు కటౌట్లు పెట్టే విషయంలో అభిమానుల పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది అక్కడ. ఒక హీరోకు 100 అడుగుల కటౌట్ పెడితే.. ఇంకో హీరో ఫ్యాన్స్ 150 అడుగులంటారు. ఈ విషయంలో ప్రధానంగా విజయ్, అజిత్ అభిమానుల మధ్య పోటీ ఉంటుంది. ఇప్పుడు సూర్య ఫ్యాన్స్ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు.

మామూలుగా సూర్య అభిమానులు కొంచెం ఒద్దికగానే ఉంటారు. సూర్య కూడా ఇలాంటివి ప్రోత్సహించడు. ఐతే ఈ మధ్య సూర్య వరుస ఫ్లాపులతో వెనుకబడిపోవడంతో యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఎక్కువైంది. దీంతో తమ హీరో స్థాయి ఏంటో చూపించాలని ఫ్యాన్స్ ఉబలాడపడిపోతున్నారు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య నటించిన ‘ఎన్జీకే’ భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న నేపథ్యంలో సూర్యకు ఒక రికార్డు స్థాయి కటౌట్ పెట్టాలని ఫిక్సయ్యారు.

ఇండియాలో ఇప్పటిదాకా ఏ హీరోకూ లేని స్థాయిలో 215 అడుగుల కటౌట్ రెడీ చేస్తున్నారు. తిరుత్తణిలో సిద్ధమవుతున్న ఈ కటౌట్ కోసం ఏకంగా ఆరున్నర లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఈ విషయాన్ని సూర్య అభిమానులు గర్వంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇది అభిమానం కాదు పైత్యం అంటూ నెటిజన్ల నుంచి సెటైర్లు కూడా పడుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English