లారెన్స్ పేరు కూడా పోస్టర్ మీద వేయలేదే..

లారెన్స్ పేరు కూడా పోస్టర్ మీద వేయలేదే..

ఎంతో ఆసక్తి రేకెత్తించిన ‘కాంఛన’ హిందీ రీమేక్ ‘లక్ష్మీబాంబ్’ అనూహ్యంగా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ‘లక్ష్మీబాంబ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఒక్క రోజు తిరిగేసరికి లారెన్స్ ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి పెద్ద షాకిచ్చారు. దక్షిణాది దర్శకులంటే ఒక రకమైన చిన్నచూపున్న బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఇంతకుముందు మన క్రిష్ జాగర్లమూడిని ఎంతగా అవమానించాయో తెలిసిందే.

వారి ట్రీట్మెంట్ తట్టుకోలేక ‘మణికర్ణిక’ నుంచి చివరి దశలో తప్పుకున్నాడు క్రిష్. ఆ వివాదం చాలా పెద్దదైంది. కంగనా చేసిన అతిని పూర్తిగా సమర్థిస్తూ.. క్రిష్‌ను ప్రొడక్షన్ హౌజ్ చాలా అవమానించింది. ఇప్పుడు ‘లక్ష్మీబాంబ్’ నిర్మాతలు లారెన్స్ పట్ల చాలా అవమానకరంగానే వ్యవహరించిన విషయం స్పష్టమవుతోంది. దర్శకుడికి తెలియకుండా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడమంటే అంత కంటే అతడికి అవమానం ఏముంటుంది?

‘లక్ష్మీబాంబ్’ ఫస్ట్ లుక్ చూసిన వాళ్లందరికీ అప్పుడే ఒక సందేహం తలెత్తింది. పోస్టర్ మీద లారెన్స్ పేరు లేదు. ‘అక్షయ్ కుమార్ ఇన్’.. అంటూ హీరోకు మాత్రమే క్రెడిట్ ఇచ్చారు. కిందేమో రిలీజ్ డేట్ వేశారు. ‘కాంఛన’ అనే సినిమా దక్షిణాదిన ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఆ చిత్రానికి కర్త, కర్మ, క్రియ.. అన్నీ లారెన్సే. ఇప్పుడు ఈ చిత్రం హిందీలోకి వెళ్తోందన్నా కూడా లారెన్స్ కథాకథనాల్లోని బలమే కారణం. అందులో ఏ హీరో నటించినా సక్సెస్ కావడానికి అవకాశాలున్నాయి. అక్షయ్ కుమార్ అనేవాడు పేరుకే. అలాంటపుడు అక్షయ్ కుమార్ పేరు వేసి.. లారెన్స్ పేరును పోస్టర్ మీద వేయకపోవడమే అవమానకరం.

దర్శకుడికి చెప్పకుండా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం ఇంకా దారుణం. లారెన్స్‌ను డమ్మీగా పెట్టి తమదైన స్టయిల్లో ‘లక్ష్మీబాంబ్’ను తెరకెక్కించాలని నిర్మాణ సంస్థకు చెందిన టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా జరిగిన కొన్ని రోజుల చిత్రీకరణలో ఆల్రెడీ లారెన్స్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. ఫస్ట్ లుక్ విషయంలో చేసిన అతితో ఇక తాను ఈ సినిమాలో కొనసాగడం అసాధ్యమని బయటికి వచ్చేశాడు. లారెన్స్ మళ్లీ ఈ ప్రాజెక్టులో భాగం అయ్యే అవకాశాలే లేవని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English