‘ఖుషి’ దర్శకుడి జోరు మామూలుగా లేదు

‘ఖుషి’ దర్శకుడి జోరు మామూలుగా లేదు

90ల్లో ‘వాలి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఎస్.జె.సూర్య. ఆ తర్వాత అతను తీసిన ‘ఖుషి’ ఇంకెంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా అతనే రీమేక్ చేశాడు. అది అప్పట్లో భారీ విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో మహేష్ బాబుతో ‘నాని’, పవన్‌తో ‘కొమరం పులి’ తీశాడు. ఈ రెండూ డిజాస్టర్లయ్యాయి.

ఒక దశ దాటాక తమిళంలోనూ అతడికి వరుసగా ఫ్లాపులే వచ్చాయి. ఐతే ‘నాని’ తమిళ వెర్షన్ ‘న్యూ’ కోసం అనుకోకుండా నటుడిగా మారిన సూర్య.. ఆ తర్వాత అడపాదడపా కొన్ని పాత్రలు చేశాడు. అవి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రాలే. వాటిలో అతడి నట ప్రతిభ పెద్దగా తెలియలేదు. కానీ వేరే దర్శకుల చేతిలో పడ్డాక సూర్య రాత మారిపోయింది.

‘పిజ్జా’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటించిన ‘ఇరైవి’ అతడి కెరీర్‌కు పెద్ద మలుపుగా నిలిచింది. ఆ చిత్రంలో అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేశాడు. ఇక ఆ తర్వాత అతను వెనుదిరిగి చూసుకున్నది లేదు. వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్లిపోతున్నాడు. ‘స్పైడర్’ ఫ్లాప్ అయినా అతడి నటనకు ప్రశంసలు దక్కాయి. బ్లాక్ బస్టర్ అయిన ‘మెర్శల్’లో విలన్ పాత్రతో అదరగొట్టేశాడు. తాజాగా అతను హీరోగా ‘మాన్‌స్టర్’ అనే సినిమా వచ్చింది. ఒక ఎలుక వల్ల అష్టకష్టాలు పడే హీరో మధ్య తరగతి వ్యక్తి కథ ఇది. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

కోలీవుడ్ గర్వించదగ్గ సినిమా ఇదంటున్నారు. సూర్య నటన గురించి కూడా అందరూ పొగిడేస్తున్నారు. నటుడిగా అతను మరో మెట్టు ఎక్కేశాడంటున్నారు. సోలో హీరోగా సూర్యకు ఇది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య సరసన ప్రియ భవానీ శంకర్ నటించింది. దర్శకత్వానికి పూర్తిగా టాటా చెప్పేసిన సూర్యకు నటుడిగా అరడజనుకు పైగా అవకాశాలు చేతిలో ఉండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English