'ఢిల్లీ కుమారస్వామి' ఎవరో

'ఢిల్లీ కుమారస్వామి'  ఎవరో

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే ఎక్కువని, సర్వేలు, నిపుణులు, విశ్లేషకులు అంటున్న నేపథ్యంలో...హ‌స్తిన‌లో రాజ‌కీయాలు మారుతున్నాయి. అత్యధిక స్థానాలు సాధించే పార్టీగా బీజేపీ నిలుస్తుందనేది స్పష్టం అవుతూ ఆ పార్టీకి 180-190 వరకు సీట్లు వస్తాయని అంచనా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 120-130 సీట్లు సాధిస్తుంద‌నే అంచ‌నా ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయి. మరోవైపు ప్రధాని మోదీని గద్దెదింపడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు కదుపుతోంది. అవసరమైతే ప్రధాని పదవి వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవల అన‌డం కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది.

ప్రాంతీయ పార్టీ మ‌ద్ద‌తుతో స‌ర్కారులో కాంగ్రెస్ వైఖరి కీలకం కానుంది. తొలి నుంచీ రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నా...మోదీని గద్దె దింపడానికి అవసరమైతే ప్రధాని పదవి వదులుకుంటాం అని ఆ పార్టీ నేతలిస్తున్న ప్రకటనలు రాజకీయంగా కొత్త వ్యూహాలకు తెరలేపుతోంది. కర్ణాటక తరహా విధానం అమలుకూ కాంగ్రెస్ సిద్ధమవుతుండటం ప్రాంతీయ పార్టీల నేతల్లో ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి వంటి నేతల ఆశలు చిగురిస్తున్నాయి. అవసరమైతే ప్రధాని అయ్యే అవకాశాన్ని ప్రాంతీయ పార్టీలకు ఇచ్చి, తాము వెనుకుండి నడిపించాలని సోనియాగాంధీ భావిస్తుండ‌టం వ‌ల్ల ఈ ప్రాంతీయ నేత‌లు ఢిల్లీ పీఠంపై ఆశ‌లు పెట్టుకున్నారంటున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ శిబిరంలోని ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీ, ఎస్పీ-బీఎస్పీ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో చిన్నాచితకా పార్టీలు ఎక్కువ సంఖ్యలో ఉండే కన్నా.. ఒకటి రెండు పెద్ద పార్టీలు ఉంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని సోనియా భావిస్తున్న‌ట్లు స‌మాచారం ఇప్పటికే యూపీఏ-1, యూపీఏ-2 సంకీర్ణ ప్రభుత్వాలను నడిపించిన అనుభవం ఆమెకు ఉన్నది. కాబట్టి ఈసారి హంగ్ పరిస్థితులు ఏర్పడితే ప్రధాని అవకాశాన్ని అత్యధిక స్థానాలు గెలుచుకునే ప్రాంతీయ పార్టీకి ఇవ్వాల‌ని ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో....`ఢిల్లీ కుమారస్వామి` ఎవ‌ర‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English