మళ్లీ రిస్క్‌కి రెడీ అయిన విక్రమ్

Vikram Dhruv

కొంతమంది హీరోలకి హిట్లు, ఫ్లాపులతో సంబంధం ఉండదు. వాళ్లు ఏ సినిమా చేస్తున్నా ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. విక్రమ్‌ ఆ తరహా హీరోనే. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాలు చేశాడు విక్రమ్. ఆ తర్వాత హీరోగా ఎదుగుతూ వచ్చాడు. కానీ అతనిలోని అసలైన నటుణ్ని శంకర్ బైటికి తీశాడు. అంతకుముందు ‘సేతు’లాంటి సూపర్బ్ ఫిల్మ్స్‌, ‘సామి’ లాంటి హిట్స్ తన ఖాతాలో ఉన్నా.. ‘అపరిచితుడు’ తర్వాత అసలు విక్రమ్ ఏంటనేది ప్రపంచానికి పూర్తిగా తెలిసింది. అతని ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

ఒక్కసారి ఫేమ్ వచ్చాక ప్రయోగాలకే ప్రాధాన్యత ఇచ్చాడు విక్రమ్. ప్రతి సినిమా ఒక ఎక్స్‌పెరిమెంటే. డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటాడు. ఒకే సినిమాలో రకరకాల వేరియేషన్స్ చూపిస్తాడు. అయితే ఈ ప్రయోగాలన్నీ నటుడిగా తనని మరిన్ని మెట్లు ఎక్కిస్తున్నాయి తప్ప కమర్షియల్‌గా మాత్రం నిరాశపరుస్తున్నాయి. అదిరిపోయే హిట్ అతని ఖాతాలో పడి చాలా కాలమే అయ్యింది. అయినా కూడా ఇప్పటికీ రిస్క్ తీసుకుంటూనే ఉన్నాడు విక్రమ్.       

ప్రస్తుతం ధృవనక్షత్రం, కోబ్రా, మహాన్, పొన్నియిన్ సెల్వన్, మహావీర్ కర్ణ చిత్రాలు చిత్రాలు చేస్తున్నాడు విక్రమ్. ఇవింకా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకి కమిటయ్యాడు. అది కూడా పా రంజిత్‌తో. రంజిత్‌ కూడా కాస్త విక్రమ్‌ టైపే. వెరైటీని కోరుకుంటూ ప్రతిసారీ సినిమా బాగా తీశాడనిపించుకుంటాడు. కానీ, కాసులు సంపాదించడంలో ఫెయిలవుతాడు. రజినీకాంత్‌తో కబాలి, కాలా లాంటి చిత్రాలు తీసినా కూడా స్టార్ డైరెక్టర్ కాలేకపోవడానికి అదే కారణం. ఆయనతో సినిమా అంటే విక్రమ్‌ మరో ప్రయోగానికి సిద్ధపడినట్టే.   

అసలు రంజిత్‌ డైరెక్షన్‌లో కమల్‌ ఓ మూవీ చేయబోతున్నారనే వార్తలు ఆమధ్య వచ్చాయి. కానీ ఇప్పుడు సడెన్‌గా విక్రమ్‌ సినిమా అనౌన్స్ చేశాడు. విక్రమ్‌కి ఇది అరవై ఒకటో సినిమా. కె.జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టేకింగ్ స్టైల్‌ బాగున్నా కాన్సెప్టులు సరిగ్గా లేకపోవడమే రంజిత్‌ ఫెయిల్యూర్‌‌కి కారణమని అందరూ చెబుతారు. మరి తను విక్రమ్‌ కోసం ఏ కథ రాశాడో, ఏం చెప్పి తనని కన్విన్స్ చేశాడో. సరైన సక్సెస్‌లు సమయంలో సక్సెస్‌ గ్యారంటీ లేని దర్శకుడితో సినిమా చేయడానికి విక్రమ్‌ రెడీ అవ్వడం సరైన నిర్ణయమే అవుతుందో లేదో చూడాలి మరి.