ఆ పరాజయాన్ని ఎన్టీఆర్‌కు ఎలా ఆపాదిస్తారు?

 ఆ పరాజయాన్ని ఎన్టీఆర్‌కు ఎలా ఆపాదిస్తారు?

ఎలా మొదలైందో.. ఎందుకు మొదలైందో తెలియదు.. ప్రస్తుతం ట్విట్టర్లో నందమూరి అభిమానుల మధ్య అంతర్గతంగా పెద్ద యుద్ధమే నడుస్తోంది. నందమూరి అభిమానుల్లో బాలయ్య మద్దతుదారులు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండుగా విడిపోయి తీవ్ర స్థాయిలో వాదులాడుకుంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవచ్చన్న ప్రచారం గట్టిగా సాగుతున్న నేపథ్యంలో.. ఆ పార్టీ భవిష్యత్తుపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. చంద్రబాబు 70వ పడికి చేరువ అవుతున్న నేపథ్యంలో ఆయన ఇంకెంతో కాలం పార్టీని నడపలేకపోవచ్చని.. ఈ నేపథ్యంలో ఆయన వారసులు ఎవరన్న ప్రశ్న తలెత్తడంతో ఈ వివాదం రాజుకున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్, నందమూరి బాలకృష్ణలే పార్టీ బాధ్యతలు తీసుకోవాలని బాలయ్య ఫ్యాన్స్ అంటుంటే.. వాళ్లిద్దరూ అసమర్థులని, తెలుగుదేశం పార్టీని బతికించగలిగే సత్తా జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే ఉందని అతడి మద్దతుదారులు వాదిస్తున్నారు.

ఐతే లోకేష్, బాలయ్యల ‘సత్తా’ ఏంటన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయ నాయకులుగా వీళ్లిద్దరూ ఎప్పుడూ రాణించింది లేదు. జనాల్లో కూడా అంత సానుకూల అభిప్రాయం లేదు. లోకేష్‌ను బలవంతంగా పార్టీపై రుద్దే ప్రయత్నం బాబు చేస్తన్నారన్న విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. ఇక బాలయ్యకు తనపై తనకు ఎప్పుడూ అదుపు ఉండదు. పబ్లిక్‌లో బాలయ్య చాలాసార్లు దారుణంగా ప్రవర్తించాడు. బాలయ్య కానీ, లోకేష్ కానీ మైకు అందుకుంటే ఎంతగా తడబడతారో తెలిసిందే. వివిధ అంశాలపై వీరి అవగాహన మీద కూడా ఎన్నో సందేహాలున్నాయి. ఈ విషయంలో ఎన్టీఆర్ సామర్థ్యం గురించి ఎవరికీ సందేహాలు లేవు.

సామన్య జనాల్లో ఎవరిని అడిగినా.. బాలయ్య-లోకేష్.. ఎన్టీఆర్‌లలో ఎవరు సమర్థులనే విషయంలో పూర్తి స్పష్టతతో సమాధానం ఇస్తారు. ఇప్పుడు తారక్‌ను విమర్శిస్తున్న వాళ్లు 2009 ఎన్నికల్లో అతను ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ అప్పుడు మొత్తంగా పార్టీనే విఫలమైంది. అలాంటపుడు ఆ ఓటమిని తారక్‌కు ఎలా ఆపాదిస్తారు? అవసరానికి అతడిని ఉపయోగించుకుని వదిలేయడం, అతడి సినిమాల్ని కూడా దెబ్బ తీయాలని ప్రయత్నించడం జనాలందరికీ తెలిసిన విషయమే. ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసి రివర్సులో ఎన్టీఆర్‌నే విమర్శించడం మీద అతడి అభిమానుల ననుంచే కాదు.. తటస్థుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English