తీవ్ర స్థాయిలో బాలయ్య-ఎన్టీఆర్ ఫ్యాన్ వార్స్

తీవ్ర స్థాయిలో బాలయ్య-ఎన్టీఆర్ ఫ్యాన్ వార్స్

నందమూరి వారసులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య చాలా ఏళ్లుగా సరైన సంబంధాలు లేని సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా అరంగేట్రం చేశాక కూడా చాలా ఏళ్ల వరకు వీరి మధ్య ఎలాంటి అనుబంధం లేదు. ఐతే తారక్ హీరోగా మంచి స్థాయిని అందుకున్నాక మధ్యలో బాబాయికి దగ్గరయ్యాడు. కొన్నేళ్లు సన్నిహితంగానే కనిపించారు. కానీ 2009 ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడం, కానీ సరైన ఫలితాలు రాకపోవడంతో అతను పార్టీకి దూరమైపోయాడు. తర్వాత కొన్ని అనూహ్య పరిణామాల మధ్య బాలయ్యతో కూడా ఎన్టీఆర్‌కు చెడింది. గత ఐదారేళ్లలో అంతకంతకూ వీరి మధ్య దూరం పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. గత ఏడాది హరికృష్ణ మరణం తర్వాత బాబాయి, అబ్బాయి కాస్త దగ్గరైనట్లు కనిపించారు కానీ.. తర్వాత షరామామూలే.

ఇప్పుడు ఉన్నట్లుండి బాబాయి-అబ్బాయి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వార్ నడుస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అని ఉత్కంఠ రేగుతున్న సమయంలో బాలయ్య, జూనియర్ అభిమానులు ట్విట్టర్లో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ గెలవని పక్షంలో బాలయ్య కానీ, లోకేష్ కానీ పార్టీని నిలబెట్టలేరని.. ఎన్టీఆర్ మాత్రమే పార్టీని కాపాడగలరని అతడి అభిమానులు ట్వీట్లు వేయడంతో మొదలైంది రగడ. ఎన్టీఆర్ ఒకసారి ప్రచారం చేస్తే పార్టీ దెబ్బ తిందని, ఆ తర్వాత అతను పార్టీకి ఏమీ చేయలేదని.. బాలయ్య సాయం తీసుకుని, ఆ తర్వాత ఆయన్ని గౌరవించలేదని.. తారక్‌కు టీడీపీలో స్థానమే లేదని బాలయ్య ఫ్యాన్స్ అతడిని విమర్శించడం మొదలుపెట్టారు. ఇరు వర్గాలూ ఎవరి వాదన వాళ్లు వినిపిస్తూ అవతలి వాళ్లను కించపరుస్తూ పెద్ద ఎత్తునే ట్వీట్ యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నికల ఫలితాలు వచ్చి, తెలుగుదేశం నిజంగానే ఓడిపోత పరిస్థితి ఎలా ఉంటుందో మరి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English