అంజలి సినిమా అట.. పట్టించుకుంటారా?

అంజలి సినిమా అట.. పట్టించుకుంటారా?

దక్షిణాదిన అంజలి అనే హీరోయిన్ ఒకరున్నారన్న సంగతే జనాలు మరిచిపోయారు. తమిళ ప్రేక్షకులకు ఆమె గుర్తుందేమో కానీ.. తెలుగు వాళ్ల దృష్టిలో మాత్రం ఆమె లేదు. కోలీవుడ్లో ఒక గొడవ వల్ల డిస్టర్బ్ అయిన సమయంలో టాలీవుడ్‌కు వచ్చి కొన్ని సినిమాలు చేసిన అంజలి.. ఆ తర్వాత ఉన్నట్లుండి ఇక్కడి నుంచి అంతర్ధానం అయిపోయింది. ‘గీతాంజలి’ హిట్టయింది కదా అని వరుసబెట్టి హార్రర్ సినిమాలు చేయగా.. అవేవీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. చివరగా తెలుగులో ఆమె నటించిన ‘చిత్రాంగద’ దారుణమైన ఫలితాన్నందుకుంది. అయినా అంజలి హార్రర్ సినిమాలు మానట్లేదు. తాజాగా ‘లిసా’ పేరుతో ఆమె ఓ సినిమా చేసింది. వాస్తవానికి ఇది తమిళ సినిమా. తెలుగులోకి డబ్బింగ్ చేశారు. కానీ తెలుగులో తొలి త్రీడీ హార్రర్ మూవీ అంటూ ప్రచారం చేస్తున్నారు.


ఇన్నాళ్లూ వార్తల్లోనే లేని ఈ చిత్రాన్ని ఉన్నట్లుండి ట్రైలర్ లాంచ్‌తో జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 24నే ‘లిసా’ రిలీజ్ కాబోతోంది. ఇక దీని ట్రైలర్ విషయానికి వస్తే.. ఎప్పుడూ హార్రర్ సినిమాల్లో చూసే విజువల్సే ఇందులోనూ కనిపించాయి. ఊరు అవతల అడవి లాంటి ప్రదేశంలో పాత కాలం ఇల్లు.. అందులోకి వెళ్లే ఒక జంట.. వీళ్లకు తోడుగా ఒకరిద్దరు కమెడియన్లు.. ఆ ఇంట్లో అనూహ్య ఘటనలు.. దయ్యం జాడలు.. దీని వెెనుక గుట్టును కనిపెట్టే పనిలో పడే హీరోయిన్.. ఆపై ఓ ఫ్లాష్ బ్యాక్.. చివరగా ఒక భయంకరమైన క్లైమాక్స్.. ఇలా ఒక ఫార్మాట్లో సాగిపోయే సినిమాలాగానే కనిపిస్తోంది. అంజలి అంటేనే మన జనాలు పట్టించుకోని ఈ సమయంలో మనవాళ్లకు పరిచయం లేని చాలా ముఖాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఇలాంటి సినిమా చూడ్డానికి మన ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English