‘మిఠాయి’ దర్శకుడి సంచలన ఆరోపణ

‘మిఠాయి’ దర్శకుడి సంచలన ఆరోపణ

టాలీవుడ్ న్యూ ఏజ్ కమెడియన్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో రెండు నెలల కిందట వచ్చిన ‘మిఠాయి’ అనే సినిమా దారుణమైన ఫలితాన్నందుకున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ హీరోలుగా సినిమా అనగానే అందరిలోనూ ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. మొదట్లో దీని ప్రోమోలు కూడా ఆకర్షణీయంగా అనిపించాయి. ఒక కొత్త తరహా సినిమా చూడబోతున్న భావన కలిగించాయి. కానీ ఆ ఆశలతో థియేటర్లకు వెళ్లిన వాళ్లకు దిమ్మదిరిగిపోయింది. అర్థం పర్థం లేని ఈ సినిమాతో ప్రేక్షకులకు తల బొప్పిగట్టింది. ఐతే ‘మిఠాయి’ ఫలితంపై ముందే అంచనాకు వచ్చేసిన రాహుల్ రామకృష్ణ.. ఈ సినిమా రిలీజైన రెండో రోజే దీని గురించి నెగెటివ్‌గా మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా తాను అనుకున్నట్లుగా రాలేదని.. దాన్ని సరిదిద్దడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని.. దీంతో ప్రమోషన్లకు కూడా రాలేదని అతను చెప్పాడు. దర్శకుడు ప్రశాంత్ కుమార్‌ మీద సెటైర్లు వేశాడు.

ఐతే తన ఫెయిల్యూర్‌ను అంగీకరించిన ప్రశాంత్.. రాహుల్ మీద రివర్స్ పంచ్‌లు వేశాడు. అంతటితో ఆ గొడవ సద్దుమణిగినట్లే అనిపించింది. కానీ ఆ సినిమా గురించి, గొడవ గురించి అంతా మరిచిపోయిన సమయంలో ఇప్పుడు ప్రశాంత్ కుమార్ మళ్లీ లైన్లోకి వచ్చాడు. రాహుల్ మీద సంచలన ఆరోపణలు చేశాడు. రాహుల్.. మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’లో ఓ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆ చిత్రంలో తనకు మరిన్ని కీలక సన్నివేశాలు ఉన్నాయని.. కానీ తన కంటే ఎక్కువ పేరు వస్తుందేమో అన్న భయంతో మహేష్ బాబు వాటిని కట్ చేయించాడని రాహుల్ చాలామందితో చెప్పుకుని తిరిగాడని.. తనతో కూడా అదే మాట అన్నాడని ప్రశాంత్ ఆరోపించాడు. రాహుల్ వ్యక్తిత్వం అంత మంచిది కాదనే ధోరణిలో అతను మాట్లాడాడు.

ఐతే ఈ ఆరోపణల్లో నిజమెంతో కానీ.. ఈ సందర్భంలో ఈ ఆరోపణలు చేయడం అంటే ఏదో అక్కసుతో అన్నట్లే ఉంది. దీనిపై రాహుల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English