దేశంలోనే అతి పెద్ద సైబర్ స్కామ్ గుట్టురట్టు

ఈ టెక్నాలజీ యుగంలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. డిజిటల్ లావాదేవీలు ఊపందుకుంటున్న తరుణంలోనే సైబర్ కేటుగాళ్ల ఆన్ లైన్ ఆర్థిక నేరాలు పెరిగిపోవడం కలవరపెడుతోంది. ఓటీపీలు ఎవ్వరికీ ఇవ్వొద్దని, ఆన్ లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు, పోలీసులు చెబుతున్నప్పటికీ…కొందరు అమాయకులు కేటుగాళ్ల మాయలో పడి భారీ మొత్తంలో డబ్బులు నష్టపోతున్నారు.

ఇక, ఏకంగా తాము బ్యాంకులనుంచే మాట్లాడుతున్నామంటూ కొందరు సైబర్ మోసగాళ్లు కొత్త క్రైంకు తెరతీశారు. ఈ క్రమంలోనే తాజాగా దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం గుట్టు రట్టు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. లోన్ బజార్, ద లోన్ ఇండియా, ఎస్బీఐ ధనీ బజార్ పేర్లతో కొందరు మోసగాళ్లు నడుపుతున్న నకిలీ కాల్ సెంటర్ రాకెట్ ను ఛేదించామని తెలిపారు. ఇలా జనం నుంచి వందల కోట్లు కొట్టేసిన కేటుగాళ్లను కటకటాల వెనక్కు నెట్టామని వెల్లడించారు.

ఈ స్కామ్ లో ఒక స్ఫూఫింగ్ యాప్ ద్వారా 18601801290 అనే నంబర్ నుంచి స్ఫూఫింగ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎస్బీఐ కస్టమర్ కేర్ నుంచే ఫోన్ వస్తున్నట్టు కస్టమర్లను మోసగాళ్లు నమ్మించేవారు. ఇలా ఒక ఏడాదిలో 33 వేల కాల్స్ చేసి, వందల కోట్లు కొట్టేశారు. ఎస్బీఐ ఏజెంట్ల నుంచి కస్టమర్ల వివరాలు సేకరించి క్రెడిట్ కార్డు ఉన్నవారిని టార్గెట్ చేసేవారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులున్నాయి. చివరకు వారిపాపం పండడంతో మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి 30 సెల్ ఫోన్లు, 3 ల్యాప్ టాప్ లు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నారు.