రకుల్ ఇన్నేళ్ల కల ఫలించినట్లేనా?

రకుల్ ఇన్నేళ్ల కల ఫలించినట్లేనా?

ఉత్తరాది నుంచి దక్షిణాదికి దిగుమతి అయ్యే ఏ హీరోయిన్‌కైనా సరే.. ఇక్కడ ఎన్ని విజయాలు అందుకున్నా, ఏ స్థాయికి చేరినా బాలీవుడ్‌కు వెళ్లి పేరు తెచ్చుకోవాలని, హిట్టు కొట్టాలని ఆశగా ఉంటుంది. తమ భాషలో సినిమా చేయాలని, దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న బాలీవుడ్ సినిమాల్లో వెలిగిపోవాలని వాళ్లు కోరుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఐతే సౌత్‌లో స్టార్లుగా ఎదిగాక బాలీవుడ్‌పై తమదైన ముద్ర వేసిన హీరోయిన్లు చాలా తక్కువమంది. సిమ్రాన్, కాజల్ అగర్వాల్, తమన్నా.. ఇలా చాలామంది హీరోయిన్లు బాలీవుడ్లో ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. అక్కడ పాగా వేయలేకపోయారు. రకుల్ ప్రీత్ సైతం ఈ కోవకే చెందుతుంది. తెలుగులో ఒక దశలో నంబర్ వన్ హీరోయిన్ అయిన ఆమె.. హిందీలో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించింది. కానీ అవి నిరాశకే గురి చేశాయి.

‘యారియాన్’తో పాటు ‘అయ్యారీ’ ఫ్లాప్ అయి బాలీవుడ్‌లో రకుల్‌కు డోర్లు మూసేసినట్లే కనిపించాయి. కానీ కొంచెం విరామం తర్వాత ఆమె ఇంకో పెద్ద సినిమాలో ఛాన్స్ పట్టేసింది. అదే.. దే దే ప్యార్ దే. సీనియర్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రకుల్‌ ఒక ఆసక్తికర పాత్ర చేసింది. ఇందులో అజయ్ నడి వయస్కుడిగా కనిపిించాడు. అతడికి పెళ్లికి ఎదిగిన కూతురుంటుంది. ఐతే భార్య నుంచి డైవర్స్ తీసుకున్న అతడితో యంగ్ గర్ల్ అయిన రకుల్ ప్రేమలో పడుతుంది. కానీ తర్వాత అతడి భార్య తిరిగి తన జీవితంలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో సరదాగా సాగే కథ ఇది.

శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై రకుల్ చాలా ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలు ఫలించేలాగే కనిపిస్తున్నాయి. ముందు రోజు ముంబయిలో క్రిటిక్స్, సినీ ప్రముఖులకు ప్రివ్యూ షో వేయగా.. టాక్ అదిరిపోయింది. ప్రముఖ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ ఈ చిత్రానికి 4 స్టార్ రేటింగ్‌‌తో పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. మిగతా రివ్యూలు కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగినట్లు చెబుతున్నారు. రకుల్ యాక్టింగ్, గ్లామర్ గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే బాలీవుడ్లో హిట్ కొట్టాలన్న ఎన్నో ఏళ్ల రకుల్ కల తీరబోతున్నట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English