అల్లు వారి గుండెలు లబ్‌డబ్ లబ్‌డబ్

అల్లు వారి గుండెలు లబ్‌డబ్ లబ్‌డబ్

అల్లు అరవింద్ సినీ రంగంలో ఎంతో సాధించారు. ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. చాలామంది హీరోల్ని నిలబెట్టారు. కానీ అంత పెద్ద నిర్మాత తన చిన్న కొడుకు అల్లు శిరీష్‌ను మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయారు. ముందు ప్రొడక్షన్ సైడ్ ఉన్నంత కాలం శిరీష్‌కు మంచి పేరే ఉండేది. కానీ అన్నలా తాను కూడా హీరోగా వెలిగిపోదామని చూశాడు. కానీ ఆశ ఫలించలేదు. ఇప్పటిదాకా ఆరేళ్లలో నాలుగు సినిమాలు చేశాడు. అందులో రెండు డిజాస్టర్లు, ఒక ఫ్లాప్. ఒక సినిమా మాత్రం హిట్. ‘శ్రీరస్తు శుభమస్తు’తో అతడికి అత్యావశ్యకమైన విజయం దక్కింది కానీ.. దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ‘ఒక్కక్షణం’ మళ్లీ అతడిని కిందికి లాగేసింది. ఇప్పుడు ‘ఏబీసీడీ’తో తిరిగి హిట్ రుచి చూడాలని వస్తున్నాడు. కానీ థియేటర్లలో ఇంకా ‘మహర్షి’ బాగా ఆడుతుండగా, దాని చుట్టూనే చర్చలు నడుస్తుండగా.. శిరీష్ నటించిన ‘ఏబీసీడీ’ వైపు ఫ్రేక్షకులు చూస్తారా అన్నది సందేహంగా ఉంది.

శుక్రవారం రిలీజవుతున్న ఈ చిత్రం శిరీష్‌కు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచు మోహన్ బాబు లాగా ఎన్ని ఫ్లాపులు వచ్చినా పట్టించుకోకుండా కొడుకులతో కోట్లు పెట్టి సినిమాలు చేసుకుంటూ పోయే రకం కాదు అల్లు అరవింద్. ఆయన స్ట్రాటజిగ్గా అడుగులేస్తారు. ఊరికే డబ్బులు తగలేయరు. మెగా ఫ్యామిలీ కుర్రాడు కదా అని బయటి వాళ్లు పరుగెత్తుకొచ్చి సినిమాలు చేసేయరు. వేరే హీరోల సంగతేమో కానీ.. శిరీష్‌తో మాత్రం అలా కష్టమే. మధుర శ్రీధర్ అతడితో ‘ఏబీసీడీ’ చేయడమే ఎక్కువ. ఈ నేపథ్యంలో ‘ఏబీసీడీ’ ఆడి శిరీష్ మీద అరవింద్‌తో పాటు బయటి నిర్మాతలకు కూడా గురి కుదిరేలా చేయడం చాలా చాలా అవసరం. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అయితే ఆకట్టుకున్నాయి. ఒక పాజిటివ్ ఫీల్ కలిగింది. మరి సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది.. ఏమేరకు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుంది అన్నది కీలకం. అందుకే అల్లు వారితో పాటు మెగా ఫ్యామిలీ అంతా ఈ సినిమా రిజల్ట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. కొత్త దర్శకుడు సంజీవ్ రూపొందించిన ఈ చిత్రంలో శిరీష్ సరసన రుక్సర్ ధిల్లాన్ నటిచింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English