ఛార్మిని నటించమని ప్రతి రోజూ అడుగుతున్నారట

ఛార్మిని నటించమని ప్రతి రోజూ అడుగుతున్నారట

కథానాయికగా దాదాపు దశాబ్దంన్నర పాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది ఛార్మి కౌర్. ఐతే ఇంకా వయసు, గ్లామర్ ఉండగానే ఆమె నటనకు స్వస్తి చెప్పేసిింది. నయనతార, త్రిష, అనుష్క, శ్రియ లాంటి వయసు మళ్లి కథానాయికలు ఇంకా దివ్యంగా కెరీర్‌ను కొనసాగిస్తుంటే వాళ్లకంటే తక్కువ వయసున్న ఛార్మి మాత్రం సినిమాలకు టాటా చెప్పేసింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. ఆయన డైరెక్ట్ చేసే, ప్రొడ్యూస్ చేసే సినిమాల్లో నిర్మాణ భాగస్వామిగా ఉంటోంది. ఒక రకంగా చెప్పాలంటే పూరి ప్రతి సినిమాకు ప్రొడక్షన్ మొత్తం ఛార్మి చేతుల మీదుగానే నడుస్తోంది. మరి నటన సంగతేంటి.. అవకాశాలు ఆగిపోయాయా అంటే అలాంటిదేమీ లేదంటోంది ఛార్మి. తనను సినిమాల్లో నటించమని ఇప్పటికీ బోలెడంత మంది అడుగుతున్నారని.. దాదాపుగా ప్రతి రోజూ తనకు ఛాన్సులు వస్తూనే ఉన్నాయని ఛార్మి చెప్పడం విశేషం.

తాను 13వ ఏటనే నటన మొదలుపెట్టానని.. అప్పట్నుంచి దశాబ్దంన్నర పాట విరామం లేకుండా నటించానని.. యాక్టింగ్ కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానని.. చాలా పెద్ద పెద్ద స్టార్లతో నటించానని.. నటిగా తన కెరీర్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నానని.. తాను సాధించనిది, కోల్పోయినది అంటూ ఏమీ లేదని.. కాబట్టి సంతోషంగా నటనకు గుడ్ బై చెప్పేశానని ఛార్మి చెప్పింది. ప్రస్తుతానికైతే మళ్లీ నటించే ఉద్దేశం లేదని ఆమె అంది. నిర్మాతగా చాలా పెద్ద బాధ్యతను మోస్తున్నానని.. ఈ బాధ్యతను ఆస్వాదిస్తున్నానని ఛార్మి చెప్పింది. పూరి సినిమాలకు సంబంధించి ప్రొడక్షన్ అంతా తానే చూసుకుంటున్నానని.. ఆయన తన బాస్ అని ఛార్మి చెప్పింది. ఓవైపు సినిమాలు నిర్మిస్తూనే ‘పూరి కనెక్ట్స్’ ద్వారా యువ ప్రతిభావంతుల్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నామని.. భవిష్యత్తులో ‘పూరి కనెక్ట్స్’ చాలా పెద్ద స్థాయికి చేరుకుంటుందని ఆమె అంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English