‘మహానటి’ తీయాల్సింది కాదన్న ఆ మహానటి

‘మహానటి’ తీయాల్సింది కాదన్న ఆ మహానటి

మహానటి.. తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న సినిమా. ఈ చిత్రం మొదలైనపుడు పెద్దగా అంచనాలు లేవు కానీ.. రిలీజ్ తర్వాత అద్భుత స్పందన రాబట్టుకుని తిరుగులేని విజయం సాధించింది. తెలుగు సినిమాకే ‘మహానటి’ గర్వకారణంగా నిలిచింది. ఈ చిత్రాన్ని ప్రశంసించని వాళ్లు లేరు. ఐతే సావిత్రి సమకాలీనురాలు.. దిగ్గజ నటి షావుకారు జానకి మాత్రం ఈ సినిమా తీయాల్సింది కాదని అంటోంది.

సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరని.. రెండింటి మధ్య సన్నటి గీత ఉంటుందని.. సావిత్రి వ్యక్తిగత జీవితం అంతటినీ సినిమాలో చూపించడం తనకు నచ్చలేదని ఆమె అంది. తాను ‘మహానటి’ సినిమా చూడలేదని, కానీ ఆమె జీవింతంలోని బాధాకరమైన విషయాల్ని తెర మీద చూపించారన్న విషయం తెలిసి తనకు బాధ కలిగిందని ఆమె అంది. ‘మహానటి’ చూసిన మెచ్చిన వాళ్లకు తన మాటలు రుచించకపోయినా.. తన అభిప్రాయం ప్రకారం మాత్రం ‘మహానటి’ తీయాల్సింది కాదని షావుకారు జానకి స్పష్టం చేసింది.

ఇక మహిళలకు ఎన్నో ఆంక్షలు ఉన్న రోజుల్లో తాను సినిమాల్లో నటించానని.. దాని వల్ల తన బంధువులు తనను దగ్గరికే రానివ్వలేదని షావుకారు జానకి చెప్పింది. ఆ రోజుల్లో పరాయి పురుషుడు ఒక మహిళను తాకడాన్ని జీర్ణించుకునేవాళ్లు కాదని.. అలాంటిది సినిమాల్లో వేరే వ్యక్తులకు ప్రేయసిగా, భార్యగా నటించడంతో తన బంధువులు జీర్ణించుకోలేక తనను దూరం పెట్టారని ఆమె చెప్పింది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా తాను సినిమాల్లో నటించానన్నారు.

తాను సినిమాల్లోకి వచ్చే సమయానికే తనకు పెళ్లయిందని చెప్పింది. తాను నటించిన కథానాయకుల్లో ఎన్టీఆర్ గొప్ప అందగాడని.. తనకు పెళ్లయింది సరిపోయింది కానీ.. లేదంటే ఎన్టీఆర్ లాంటి అందగాడిని చూసి ఏ కథానాయిక అయినా ముగ్ధురాలు కాకుండా ఉంటుందా అని ఆమె ప్రశ్నించడం విశేషం. ‘ఆలీతో జాలీగా’ షోలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English