అల్లువారి పిల్లోడు థియేటర్లకు రప్పించగలడా?

అల్లువారి పిల్లోడు థియేటర్లకు రప్పించగలడా?

రాను రాను టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ప్రమాదకరంగా తయారవుతోంది. పెద్ద పెద్ద స్టార్లు సైతం ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించలేకపోతున్నారు. ఒక కుటుంబం థియేటర్‌కు వెళ్తే మినిమం వెయ్యి రూపాయలుు ఖర్చు అవుతోంది. దాని బదులు ఆ వెయ్యి రూపాయలు పెట్టి ఏడాదికి అమేజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే.. రిలీజైన నెలా నెలన్నరకు కుటుంబమంతా ఇంట్లో కూర్చుని సినిమా చూసుకోవచ్చనే ఆలోచన జనాలకు పెరిగిపోతోంది.

అలా కాకుండా త్వరగా సినిమా చూడాలనుకునేవాళ్లు పైరసీ ప్రింట్లను కూడా ఆశ్రయిస్తున్నారు. కచ్చితంగా థియేటరుకు వెళ్లి చూడాలంటే ఆ సినిమాకు, హీరోకు ఒక రేంజ్ ఉండాలని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలకు గడ్డు పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో బాక్సాఫీస్ వేటకు వస్తున్నాడు అల్లు శిరీష్.

శిరీష్ కొత్త సినిమా ‘ఏబీసీడీ’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మామూలు హీరోల పరిస్థితే కష్టంగా ఉంటే శిరీష్ మీద ప్రేక్షకుల్లో ఒక నెగెటివిటీ ఉన్న విషయం గుర్తుంచుకోవాలి. పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ శిరీష్ ఇప్పటిదాకా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోలేపోయాడు. మొదట్లో అతను చేసిన సినిమాల వల్ల పాజిటివిటీ రాకపోగా నెగెటివిటీ పెరిగింది. దాన్ని తగ్గించుకుని న్యూట్రల్ స్థాయికి రావడానికే అతను కష్టపడుతున్నాడు.

‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో ఆ స్థితికి వచ్చినట్లే కనిపించాడు కానీ.. ‘ఒక్కక్షణం’ మళ్లీ అతడిని వెనక్కి లాగేసింది. శిరీష్ కొత్త సినిమా ‘ఏబీసీడీ’ ప్రోమోలు చూస్తే బాగానే అనిపిస్తున్నాయి. కానీ సినిమా ఎలా ఉన్నప్పటికీ శిరీష్ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలడా అన్నదే సందేహంగా మారింది. అతడి మీద ఉన్న నెగెటివిటీ అలాంటిది. సినిమాకు ఓ మోస్తరు టాక్ వస్తే మాత్రం కష్టమే. చాలా బాగుందన్న టాక్ రావాలి. అది స్ప్రెడ్ కావాలి. అప్పుడే ‘ఏబీసీడీ’ అల్లు ఫ్యామిలీ ఆశించిన హిట్ అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English