సూపర్ స్టార్లకు ఒక దండం బాబోయ్

సూపర్ స్టార్లకు ఒక దండం బాబోయ్

దిల్ రాజు అంటే ఏదో ఒక తరహా సినిమాలకు పరిమితం అయిపోయే రకం కాదు. ఆయన చిన్న సినిమాలు తీస్తారు. మీడియం రేంజ్ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తారు. భారీ చిత్రాలూ కూడా సెట్ చేస్తుంటారు. ఐతే కొంత కాలంగా ఆయనకు భారీ చిత్రాలు అంతగా కలిసి రావడం లేదు. వాటితో నష్టాలు, అనవసర తలనొప్పులు తప్ప మరేమీ మిగలట్లేదు. కానీ చిన్న, మీడియం రేంజ్ సినిమాలు ఆయనకు చాలా మంచి ఫలితాన్ని అందిస్తున్నాయి. రాజు నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మహర్షి’ విషయానికి వస్తే.. దీని వల్ల ఆయనకు పెద్దగా లాభాలు మిగిలే అవకాశాలేమీ కనిపించడం లేదు. బడ్జెట్ మరీ హద్దులు దాటిపోయింది. నిర్మాణ భాగస్వాములైన అశ్వీనీదత్, పీవీపీలకు సెటిల్ చేసేసరికి ఆయనకు మిగిలేది పెద్దగా లేదని తెలుస్తోంది. ఈ చిత్రం ఫుల్ రన్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అన్నది సందేహంగా మారింది.


ఒకవేళ బయ్యర్లు నష్టాల పాలైతే.. రాజు తర్వాతి సినిమాకు డబ్బులు తక్కువ కట్టించుకోవాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడూ జరిగే వ్యవహారమే. ‘మహర్షి’ షూటింగ్ మొదలైనప్పటి నుంచి రాజుకు ఇది శిరోభారంగానే అనిపిస్తోందన్నది చిత్ర వర్గాల సమాచారం. ఇంతకుముందు అల్లు అర్జున్‌తో తీసిన ‘దువ్వాడ జగన్నాథం’ సైతం ఆయనకు ఇలాంటి అనుభవమే మిగిల్చింది. ఊరికే పెద్ద సినిమా చేశాడన్న పేరు తప్ప ఇలాంటి భారీ చిత్రాల వల్ల అంతిమంగా రాజుకు మిగులుతున్నదేమీ లేదు. పైగా చాలా టెన్షన్ అనుభవిస్తున్నారు.

కానీ రాజు నిర్మించే చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు టెన్షన్ తక్కువ. పెట్టుబడి తక్కువ. లాభాలు మాత్రం భారీగా ఉంటున్నాయి. అందుకు ‘ఎఫ్-2’ సరైన ఉదాహరణ. రూ.30 కోట్ల బడ్జెట్ పెడితే.. దానికి మూడు రెట్లు ఆదాయం వచ్చింది. ‘ఫిదా’ లాంటి చిన్న సినిమా రాజుకు ఎలాంటి ఫలితాన్నందించిందో గుర్తుండే ఉంటుంది. ‘డీజే’ నష్టాల్ని కవర్ చేసిన సినిమా అది. ఇలాంటి సినిమాల మేకింగ్ విషయంలోనూ పెద్ద ఇబ్బంది లేదు. రాజు టెన్షన్ ఫ్రీగా ఉంటున్నాడు. సినిమా తేడా కొట్టినా నష్టాలు తక్కువగా ఉంటాయి. ఆడితే మాత్రం లాభాల పంట పండుతుంది. అందుకే ‘మహర్షి’ తర్వాత సూపర్ స్టార్లకు దండం పెట్టేసిన రాజు పెద్ద సినిమాల జోలికే వెళ్లట్లేదు. ‘96’ రీమేక్‌తో పాటు రాజ్ తరుణ్ హీరోగా ఓ చిత్రం, నాగచైతన్యతో మరో సినిమా.. ఇంద్రగంటి మోహనకృష్ణ తీస్తున్న ‘వి’.. ఇలా చాలా వరకు చిన్న-మీడియం రేంజ్ సినిమాలే సెట్ చేసి పెట్టుకున్నాడు రాజు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English