పూరిని మార్చేే దమ్ము ఎవరికుంది?

పూరిని మార్చేే దమ్ము ఎవరికుంది?

పూరి జగన్నాథ్ ఒక మూసలో పడిపోయి చాలా ఏళ్లయింది. ఒకప్పుడు కొత్తగా అనిపించిన ఆయన కథలు, క్యారెక్టర్లు ఆ తర్వాత జనాలకు మొహం మొత్తేయడం మొదలైంది. ఏదో రెండు మూడు సినిమాలంటే ఓకే కానీ.. తిప్పి తిప్పి అవే సినిమాలు రెండంకెల సంఖ్యలో వడ్డిస్తే ప్రేక్షకుల మాత్రం ఎలా భరిస్తారు? తలతిక్క హీరో పాత్రల్ని ఎన్నాళ్లు నెత్తిన పెట్టుకుంటారు? అందుకేు ఒక దశ దాటాక పూరి సినిమాల్ని తిప్పి కొట్టడం మొదలుపెట్టారు. కానీ ఎన్ని చేదు అనుభవాలు ఎదురైనప్పటికి పూరి మాత్రం మారలేదు. మధ్యలో ఆ వక్కంతం వంశీ ఇచ్చిన కథతో సినిమా తీయబట్టి ‘టెంపర్’ ప్రత్యేకంగా అనిపించింది. బాగా ఆడింది. కానీ దానికి ముందు, తర్వాత పూరి స్వీయ రచనలో వచ్చిన సినిమాలన్నీ దారుణమైన ఫలితాలందుకున్నాయి. ఆయన సినిమాల్లో హీరోలు మారుతున్నారు తప్ప కథలు మారట్లేదు.


పూరి స్లంప్‌లో ఉండగా నందమూరి బాలకృష్ణ లాంటి హీరో ఆయనతో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. అసలు ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. మరి బాలయ్యతో అయినా కొంచెం భిన్నమైన సినిమా తీస్తాడేమో అని చూస్తే.. అదే మాఫియా కథను వడ్డించాడు పూరి. ఇప్పుడు పూరి.. రామ్‌తో జట్టు కట్టాడు. రామ్ ఎంతో ఆలోచించి ఆలోచించి చాలా టైం తీసుకుని ఈ సినిమా ఒప్పుకున్నాడు. కాబట్టి పూరి ఏదో వైవిధ్యం చూపిస్తాడనే అనుకున్నారు చాలామంది.

పూరి ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా దీనికి బజ్ కనిపించింది. ఈ రోజు టీజర్ లాంచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. తీరా చూస్తే ఆ టీజర్లో కొత్తగా ఏమీ లేదు. పూరి మార్కు తలతిక్క హీరోయిజం డోస్ కొంచెం పెంచి చూపించారు తప్పితే.. పూరి-రామ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌కు ఏమాత్రం సరితూగలేదు ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్లలో రామ్‌ను చూడటం కొత్త కాదు. పూరి సినిమాల్లోనూ ఇలాంటి పాత్రలు బోలెడన్ని చూశాం. కాకపోతే అంతా ఎక్స్‌ట్రీమ్ అనిపిస్తోందంతే. మొత్తానికి ఈ టీజర్ చూశాక పూరిని ఇంకెవరూ కూడా మార్చలేరనే భావన కలుగుతోంది జనాలకు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English