రైతుల మీద తీస్తే క్లాసిక్.. అంతేనా?

రైతుల మీద తీస్తే క్లాసిక్.. అంతేనా?

‘మహర్షి’ సినిమా గురించి విడుదలకు ముందు, తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లి.. మిగతా చిత్ర బృందం చెప్పిన మాటలు వింటే.. తెలుగు సినీ చరిత్రలోనే ఇంత గొప్ప సినిమా మరొకటి రాలేదమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ సినిమా సత్తా ఏంటో ఆల్రెడీ తెలిసిపోయింది. సినిమా చూసి మెచ్చిన వాళ్లు మెచ్చి ఉండొచ్చు. దీనికి కలెక్షన్లు వస్తుండొచ్చు. కానీ ఇది వంశీ అండ్ కో చెప్పుకుంటున్నట్లు ‘గొప్ప’ సినిమానా అనేదే ప్రశ్న. పోస్టర్ల మీద ‘ఎపిక్ బ్లాక్ బస్టర్’ అని వేసుకున్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్లో ‘ఎపిక్’ ‘క్లాసిక్’ అనే పదాల్ని విరివిగా వాడేశారు. కానీ సినిమాలో అంత గొప్పదనం అయితే ఏమీ కనిపించలేదు. కేవలం రైతుల చుట్టూ కథ నడుస్తుంది కాబట్టి ఇది గొప్ప సినిమా అనుకుంటున్నట్లుగా ఉన్నారు. ఐతే రైతుల మీద ఇప్పటిదాకా ఎవరూ సినిమా తీయలేదా.. ఇంతకంటే ఇంటెన్సిటీ చూపించలేదా అన్నది చూడాలి.

‘మహర్షి’లో చూపించిన రైతుల ఎపిసోడ్ మొత్తం ‘కత్తి’ సినిమా నుంచి లేపుకొచ్చిందన్నది స్పష్టం. అందులో ఇంతకంటే బాగా, ఇంటెన్సిటీతో రైతుల సమస్యను చూపించారు. వాటికి పరిష్కారాలు కూడా చూపించారు. అందులో ప్రెస్ మీట్ సీన్ సహా లేపుకొచ్చి ‘మహర్షి’లో పెట్టేశాడు వంశీ. ఇక ప్రథమార్ధంలో కాలేజ్ ఎపిసోడ్ మొత్తం ‘త్రీ ఇడియట్స్’ స్ఫూర్తితో రాసుకున్నదే. ఇలా సినిమా అంతటా కూడా ఏదో ఒక సినిమా ‘ఇన్‌స్పిరేషన్’ కనిపిస్తుంది. ఎక్కడా సినిమాలో ఒరిజినాలిటీ అన్నది కనిపించదు. కొత్తగా వంశీ చేసిందేమీ లేదు. ఏవేవో సినిమాల నుంచి లేపుకొచ్చిన ఎపిసోడ్లతో అతుకుల బొంత లాంటి సినిమా తీసి దాన్ని క్లాసిక్ అని, ఎపిక్ అని ప్రచారం చేసుకోవడం వంశీకే చెల్లింది. ఇక వసూళ్ల విషయానికి వస్తే సమ్మర్ సీజన్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయడం, టికెట్ల రేట్లు పెంచడం వల్ల వసూళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి తప్ప.. మామూలుగా చూస్తే దీని బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ కూడా అంతంతమాత్రమే. కాబట్టి మహర్షిని ‘ఎపిక్ బ్లాక్ బస్టర్‌’గా డబ్బా కొట్టుకోవడం ఆపితే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English