డిజాస్టర్ జోడీని మళ్లీ కలుపుతున్నాడా?

డిజాస్టర్ జోడీని మళ్లీ కలుపుతున్నాడా?

అక్కినేని నాగచైతన్యను బాగా భయపెట్టేసిన సినిమా ‘దడ’. ఏ ఉద్దేశంతో ఈ పేరు పెట్టారో కానీ.. ఆ సినిమాను తలుచుకుంటే చైతూతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు, అభిమానులకు సైతం ‘దడ’ పుడుతుంది. ‘100 పర్సంట్ లవ్’ ఘనవిజయంతో మంచి ఊపుమీదున్న సమయంలో చైతూ చేసిన ఈ యాక్షన్ మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

కానీ ఆ చిత్రం ఆ అంచనాల్ని తలకిందులు చేసింది. చైతూ కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇక అప్పట్నుంచి చైతూకు యాక్షన్ సినిమాలు షాకులిస్తూనే ఉన్నాయి. తనతో పని చేసిన మిగతా స్టార్ హీరోయిన్లను రిపీట్ చేస్తున్న చైతూ ‘దడ’ కథానాయిక కాజల్‌తో మాత్రం మళ్లీ జట్టు కట్టలేదు. అందుకు ‘దడ’ సెంటిమెంటే కారణమేమో.

ఐతే ఎట్లకేలకు మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ఇంకో సినిమా చేయనున్నట్లు సమాచారం. వీరిని కలిపే బాధ్యత దిల్ రాజు తీసుకున్నాడట. తాను నాగచైతన్యతో ఓ సినిమా నిర్మిస్తున్నట్లు దిల్ రాజు ఇటీవలే ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. ఒక కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తాడట. ఇది యాక్షన్ టచ్ ఉన్న లవ్ స్టోరీ అని సమాచారం. ఇందులో చైతూ సరసన కాజల్ ఖరారైందట. ప్రస్తుతం కాజల్ కెరీర్ ఏమంత ఊపులో లేదు. ఇంతకుముందులా ఆమె పెద్ద స్టార్లకే పరిమితం కావడం లేదు. మీడియం రేంజ్, చిన్న హీరోలతో నటిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌తో వరుసగా రెండు సినిమాలు చేసిన ఆమెకు చైతూతో నటించడానికి అభ్యంతరాలేముంటాయి. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English