శిరీష్‌కు ఉన్న ధైర్యం నిఖిల్‌కు లేదా?

శిరీష్‌కు ఉన్న ధైర్యం నిఖిల్‌కు లేదా?

ఈ రోజుల్లో పెద్ద పెద్ద హీరోలే ఏడాదికి రెండు రిలీజ్‌లు ఉండేలా చూసుకుంటున్నారు. భారీ చిత్రాలకు కూడా మరీ ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. షూటింగ్ మొదలైన ఆరు నెలల్లో సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. కానీ యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ మాత్రం గత ఏడాది ఫిబ్రవరిలో ‘కిరాక్ పార్టీ’తో పలకరించాక ఇప్పటిదాకా తన కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తేలేకపోయాడు. ఎప్పుడో ఏడాది కిందట మొదలైన ‘గణిదన్’ రీమేక్‌ను ఇంకా విడుదల చేయలేదు. ముందు ‘ముద్ర’ అనే పేరు పెట్టుకుని.. ఆ తర్వాత ‘అర్జున్ సురవరం’గా మారిన ఈ చిత్రాన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పోతున్నారు. చివరగా మే 1కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ముందు వారం ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ ప్రభంజనం చూసి భయపడి వాయిదా వేశారు.


నిజానికి ‘ఎవెంజర్స్’ తొలి వారం తర్వాత నిలబడలేకపోయింది. మే 1న ‘అర్జున్ సురవరం’ వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండేది కాదేమో. ఐతే వాయిదా వేశాక ఇలా ఆలోచించి ప్రయోజనం ఏముంది? మే 1 తర్వాత ‘అర్జున్ సురవరం’ను రిలీజ్ చేయాలనుకున్న తేదీ మే 17. మే 9న ‘మహర్షి’ ఫలితాన్ని చూసుకుని ఈ డేట్ ఖరారు చేద్దామనుకున్నారు. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ‘మహర్షి’ వీకెండ్లో భారీగానే వసూళ్లు రాబట్టింది. కానీ ఆ తర్వాత వసూళ్లలో పెద్ద డ్రాప్ కనిపిస్తోంది. ఈ వారం ‘అర్జున్ సురవరం’ చిత్రాన్ని రిలీజ్ చేసినా ఇబ్బంది లేదు. కానీ నిర్మాతల తీరు చూస్తుంటే అలాంటి ఆలోచనేమీ ఉన్నట్లు లేదు. మంగళవారం నాటికి కూడా రిలీజ్ డేట్ పోస్టర్ పడలేదు, ప్రమోషన్లు లేవంటే ఈ వారం కూడా ఈ చిత్రం రిలీజ్ కానట్లే. నిఖిల్‌తో పోలిస్తే అసలు మార్కెట్టే లేని అల్లు శిరీష్ నటించిన ‘ఏబీసీడీ’ని కూడా ధైర్యంగా ఈ వారం రిలీజ్ చేసేస్తున్నారు. కానీ నిఖిల్ చిత్రం మాత్రం రావట్లేదు. సినిమా మీద నమ్మకం ఉన్నపుడు అసలు పోటీ గురించే భయం ఉండకూడదు. మరీ ఇంతలా భయపడుతూ పోతే ఇక ఎప్పటికి ‘అర్జున్ సురవరం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేనో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English