డ్రగ్స్ కేసు క్లైమాక్స్ ఏంటో తెలుసా?

డ్రగ్స్ కేసు క్లైమాక్స్ ఏంటో తెలుసా?

రెండేళ్ల కిందట తెలుగు సినీ పరిశ్రమను షేక్ చేసేసిన డ్రగ్స్ వివాదం గుర్తుందా? పూరి జగన్నాథ్, రవితేజ, ఛార్మి సహా చాలామంది సినీ ప్రముఖులపై ఆ సందర్భంగా ఆరోపణలు వచ్చాయి. వారిలో ఒక్కొక్కరిని పోలీసులు అధికారులు పిలిచి విచారించడం.. వారి నుంచి పరీక్షల కోసం నమూనాలు సేకరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై మీడియాలో ఎంత చర్చ నడిచిందో తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసుల అతి గురించి కూడా ఒక డిస్కషన్ నడిచింది. విచారణ విషయంలో ప్రతి రోజూ మీడియాకు లీకులిస్తూ పోలీసులు అనవసర హంగామా చేశారన్న విమర్శలు వ్యక్తమవయ్యాయి. ఈ కేసును విచారించిన పోలీసు అధికారిని పెద్ద హీరోలాగా అభివర్ణించారు.

కానీ ఇలాంటి కేసుల్లో అంతిమంగా ఎలాంటి ఫలితం వస్తుందో అనుభవం ఉన్న వాళ్లు మాత్రం అప్పటి హంగామాను తేలిగ్గా తీసుకున్నారు. పోలీసులు ఈ కేసును నీరుగార్చేస్తారని, ఇంకో పెద్ద అంశం ఏదైనా దొరికితే మీడియా వాళ్లు ఈ విషయాన్ని వదిలేస్తారని కామెంట్లు చేశారు. చివరికి ఇప్పుడు చూస్తే అదే జరిగింది. డ్రగ్స్ కేసు విషయంలో దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులు తాజాగా నాలుగు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జ్ షీట్లలో ఏ ఒక్కదాంట్లోనూ గతంలో ఆరోపణలు ఎదుర్కొని, విచారణకు హాజరైన సినీ ప్రముఖుల పేర్లను చేర్చలేదు. అంటే సినీ తారలకు, డ్రగ్స్ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని సిట్ నిర్దారించనట్టే అనుకోవాలి.

మరి వాళ్లేమీ తప్పు చేయనపుడు అంత హంగామా ఎందుకు చేసినట్లు? సినిమా వాళ్లపై అనుమానాలు ఉన్నపుడు గుట్టుగా విచారణ జరపకుండా.. మీడియాలో అంత హంగామా నడిచేలా రోజు ప్రెస్ నోట్లు, లీకులు ఎందుకు ఇచ్చినట్లు..? వాళ్లు తప్పు చేశారని జనాలకు ఎందుకు ఫీలింగ్ కలిగించినట్లు? ఇలా కాకుండా సినీ ప్రముఖులు నిజంగా తప్పు చేసి ఉన్నట్లయితే.. ఒక్కరంటే ఒక్కరి పేరు కూడా ఛార్జ్ షీట్లో లేకపోవడం ఏంటి? అంటే పోలీసులు ఈ కేసును నీరుగార్చేశారనుకోవాలా? లేక ఆధారాలు సేకరించడంలో ఘోరంగా విఫలమయ్యారనుకోవాలా? మొత్తానికి ఈ కేసు విషయంలో క్లైమాక్స్ ఎలా ఉంటుందని అప్పట్లో కొందరు వ్యాఖ్యానించారో చివరికి అలాగే జరగడం మాత్రం వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయేలా చేసేదే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English