కేసీఆర్ సవాలుకు ఓకే చెప్పి.. భలే కండీషన్ పెట్టిన కిషన్ రెడ్డి

సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఆవేశంతో మాట్లాడారో తెలిసిందే. కేంద్రం తీరును తీవ్రంగా తప్పు పడుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన.. మాటల మధ్యలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేస్తూ.. బూతులు తిట్టేస్తే వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశంలో కిషన్ రెడ్డి తనతో చర్చకు వస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన సవాలుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా స్పందించారు.
యాసంగి ధాన్యం విషయంలో తాను తెలంగాణ రైతులకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసినట్లు చెప్పిన ఆయన.. కేసీఆర్ విసిరిన సవాలుకు తాను సై అని చెప్పారు. అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తానని.. ముఖ్యమంత్రితో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘పార్లమెంటు సమావేశాలు సాగుతున్నాయి. వాటిల్లో పాల్గొనాల్సి ఉంటుంది. పార్లమెంటు సమావేశం లేని రోజు చర్చకు సిద్ధం. కాకుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ బూతులు మాట్లాడకుండా ఉంటేనే చర్చకు వస్తాను. అందుకు సిద్ధంగా ఉన్నా’ అని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే మాటలకు భయపడే వ్యక్తిని తాను కాదని.. సీఎంగా ఉంటూ ఆయన వాడిన భాష ఏ రకమైనదో ఆయనే చెప్పాలన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నాగరిక భాషలో కూడా విమర్శించొచ్చని.. కేసీఆర్ కు అభ్రతా భావమని.. అందుకే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. ప్రజలు ఎవరు ఏమిటన్నది తేలుస్తారన్న ఆయన.. తెలంగాణ ప్రభుత్వం తనను ఏ రోజు కూడా తెలంగాణ బిడ్డ కేంద్రమంత్రి అయ్యాడని చూడలేదన్నారు.

తనను ‘రండా’ అంటూ మాట్లాడినా ఫర్లేదని.. తాను బాధ పడనని స్పష్టం చేశారు. తనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన నైతికతకే వదిలేసినట్లు చెప్పారు. తనతో చర్చకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సిద్దమా? అని ప్రశ్నించిన సీఎం కేసీఆర్.. తాజాగా కిషన్ రెడ్డి ఓకే చెప్పిన నేపథ్యంలో.. గులాబీ బాస్ స్టాండ్ ఏమిటి? చర్చకు ఆయన కూడా సిద్ధమని ప్రకటిస్తే మాత్రం రాజకీయంగా భారీ పరిణామం చోటు చేసుకున్నట్లు అవుతుందని చెప్పక తప్పదు. మరి.. సీఎం కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.