ఏపీకి షాక్‌: హోదా లేదు.. నిధులూ ఇచ్చేశాం.. కేంద్రం వెల్ల‌డి

ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్లో కేంద్ర మరోసారి స్పష్టతనిచ్చింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశంలో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయినందునే..ఏపీకి ప్రత్యేక సాయం చేయడానికి అంగీకారం తెలిపినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. విభజన చట్టంలో చాలా అంశాలు అమలయ్యాయని, మిగిలిన వాటికి కొంత సమయం ఉందని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు.

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై లోక్సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను చాలా వరకు అమలు చేసినట్లు పేర్కొన్నారు. మౌలిక వసతులు, విద్యాసంస్థల ఏర్పాటు వంటి వాటికి దీర్ఘకాల సమయం ఉందన్నారు. విభజన అంశాల పూర్తి కోసం చట్టంలోనే పదేళ్ల గడువు ఉందని వివరించారు. చట్టంలో పేర్కొన్న అన్ని పూర్తి చేసేందుకు కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు.. ఏపీ, తెలంగాణ ప్రతినిధులతో సమీక్ష చేస్తోందని వెల్లడించారు.

ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగయాని, ద్వైపాక్షిక సమస్యల సామరస్యపూర్వక పరిష్కారం కోసం 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తన సమాధానంలో చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులతో… ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిన వ్యవహారమని ఉద్ఘాటించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను 90:10 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచి ఉంటే.. ఏపీకి 2015-16 నుంచి 2019-20 సంవత్సరాల మధ్య కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత అదనపు సాయం లభించేదో.. ఆ మొత్తాన్ని ప్రత్యేక సాయం కింద అందించడానికి అంగీకరించినట్లు చెప్పారు.

2015-16 నుంచి 2019-20 వరకు కుదుర్చుకున్న విదేశీ రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని కేంద్రమే చెల్లించేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసిందని లోకసభకు ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు. దీంతో ఏపీకి ఇచ్చేది ఇక ఏమీ లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసిన‌ట్ట‌యింది. దీంతో ఇక‌, ఏపీ ఆర్థిక ప‌రిస్తితి మ‌రింత దారుణంగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.