చిన్న సినిమా దొరికితే వదలరే..

చిన్న సినిమా దొరికితే వదలరే..

ఒకప్పుడు భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సంస్థ ‘సురేష్ ప్రొడక్షన్స్’. రామానాయుడు మీడియం రేంజి సినిమాలు తీస్తుంటే సురేష్ బాబు మాత్రం అదే బేనర్ మీద భారీ చిత్రాలు చేసేవాడు. కానీ ఉన్నట్లుండి ఆయనలో ఉత్సాహం తగ్గిపోయింది. ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోవడంతో ఆయన రిస్క్ తీసుకోవట్లేదు. యువ దర్శకులు కొత్తవాళ్లను పెట్టి తీసే చిన్న సినిమాల మీద ఆయన ఫోకస్ పడింది. మంచి కంటెంట్‌తో సినిమా తీసి విడుదల కోసం ఇబ్బంది పడుతున్న వాళ్లకు చెయ్యిచ్చి తోడ్పాటు అందిస్తున్నారాయన. తనేమీ పెట్టుబడి పెట్టకుండా తన బేనర్ మీద రిలీజ్ చేయడం ద్వారా లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. ‘పెళ్ళిచూపులు’.. ‘మెంటల్ మదిలో’.. ‘కేరాఫ్ కంచెరపాలెం’ లాంటి సినిమాల్ని ఇలాగే రిలీజ్ చేశారు సురేష్. ఈ సినిమాలో ఆయనకు మంచి ఫలితమే అందించినట్లున్నాయి.

ఇప్పుడు సురేష్ కళ్లు మరో చిన్న సినిమాపై పడ్డాయి. అదే.. ఫలక్‌నుమా దాస్. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘అంగామలై డైరీస్’ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ‘వెళ్లిపోమాకే’.. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల్లో హీరోగా నటించిన విశ్వక్సేన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడమే కాదు.. తనే డైరెక్షన్ కూడా చేశాడు. ఈ కుర్రాడు డైరెక్షన్ చేయడమేంటి అనుకున్నారు కానీ.. దీని టీజర్ చూస్తే అతడి ప్రత్యేకత కనిపించింది. పాత బస్తీ నేటివిటీని భలేగా స్క్రీన్ మీదికి తీసుకొచ్చి.. చాలా ఆసక్తికరంగా సినిమాను ప్రెజెంట్ చేసినట్లు కనిపించాడు విశ్వక్సేన్.

టీజర్ చివర్లో ఒక బూతు డైలాగ్ వల్ల ఈ టీజర్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ‘ఫలక్‌నుమా దాస్’ ట్రైలర్ లాంచ్ చేశారు. ఇది కూడా టీజర్ లాగే ఆకట్టుకుంది. ‘జగడం’ ఛాయల్లో కనిపించిన ఈ సినిమా ఆద్యంతం యూత్‌ను ఎంటర్టైన్ చేసేలాగే ఉంది. ‘అంగ్రేజ్’ తరహాలో పాతబస్తీ నేటివిటీతో ఆకట్టుకునేలా కనిపిస్తోంది. టీజర్లో మాదిరే ట్రైలర్లో సైతం చివర్లో ఒక బూతు పంచ్ ఉంది. యూత్ ఈ సినిమా చూస్తూ వెర్రెత్తిపోయేలా ఉన్నారు. ‘పెళ్ళిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇందులో ఓ కీలక పాత్ర చేయడం విశేషం. ఉత్తేజ్ కూడా మంచి పాత్ర చేసినట్లున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బేనర్ మీద త్వరలోనే ‘ఫలక్‌నుమా దాస్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English