అల్లరోడు ఆ మాట అంటుంటే..

అల్లరోడు ఆ మాట అంటుంటే..

తెలుగు ప్రేక్షకుల్ని రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో నవ్వించిన కామెడీ హీరో అల్లరి నరేషే. అతడిపై ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. మామూలుగా వేరే హీరోలకు కొందరు యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. ఒక హీరో ఫెయిల్యూర్స్‌లో ఉంటే సంతోషించేవాళ్లూ ఉంటారు. కానీ నరేష్ విషయంలో ఇలాంటి వాళ్లు దాదాపుగా కనిపించరు. అతను మనల్ని ఎంతగా నవ్వించాడు.. అలాంటివాడికి మంచి విజయం దక్కితే చూడాలని ఆశించే వాళ్లే ఎక్కువమంది. కానీ పాపం నరేష్‌కు ఐదేళ్లకు పైగా హిట్ లేదు. ‘సుడిగాడు’తో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించి కెరీర్లోనే అతి పెద్ద హిట్ అందుకున్న నరేష్.. ఆ తర్వాత ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు. ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ఐతే హీరోగా సాధ్యం కానిది ‘మహర్షి’ ద్వారా అయింది. ఈ సినిమాలో రవి పాత్రతో అల్లరోడు మెప్పించాడు. ఈ సినిమా మంచి వసూళ్లతో సాగిపోతుండటంతో నరేష్ చాలా హ్యాపీగా ఉన్నాడు.

ఈ చిత్ర సక్సెస్ మీట్లో అల్లరోడు చాలా ఉద్వేగంతో మాట్లాడుతుంటే అది వింటున్న వాళ్లకు కూడా ఉద్వేగం కలిగింది. తాను హిట్ అనే మాటను విని నాలుగేళ్లు దాటిందని.. మళ్లీ ‘మహర్షి’తో ఆ మాట వింటుంటే చాలా ఎమోషనల్ అయిపోయానని నరేష్ చెప్పడం విశేషం. తన సినిమాలు రిలీజైతే ఫోన్లు రావడం ఆగిపోయిందని.. ఐతే ఈ సినిమా విడుదలయ్యాక తనకు చాలా ఫోన్లు వస్తాయని దర్శకుడు వంశీ పైడిపల్లి ముందే చెప్పాడని.. రిలీజ్ రోజు తన ఫోన్ అదే పనిగా మోగుతూ ఉందని.. ఆ ఫీలింగ్ మరిచిపోలేనని అన్నాడు నరేష్. ఆ సమయంలో తనకు ఎక్కడికైనా వెళ్లి గట్టిగా అరవాలనిపించిందని కూడా చెప్పాడు నరేష్. ఈ సమయంలో తన తండ్రి ఉంటే బాగుండేదని కూడా నరేష్ చాలా ఉద్వేగంగా చెప్పాడు. ఒక వైపు సంతోషం, మరోవైపు ఉద్వేగం రెండూ కనిపించాయి నరేష్ మాటల్లో. ఈ స్పీచ్ విన్న నరేష్ అభిమానులు కూడా అంతే ఉద్వేగానికి, సంతోషానికి లోనై ఉంటారనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English