పూరి లేస్తాడా.. పడుకునే ఉంటాడా?

పూరి లేస్తాడా.. పడుకునే ఉంటాడా?

పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే.. అతడి నుంచి కొత్త సినిమా వస్తోందంటే ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండకూడదు. కానీ ఆయన్నుంచి రాబోతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ విషయంలో జనాల ఫీలింగ్ వేరుగా ఉంది. పూరి రాసే తలతిక్క హీరో పాత్రలకు పర్ఫెక్ట్‌గా సూటవుతాడని అనిపించే యువ కథానాయకుడు రామ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండటం.. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి పూరి చాలా కాన్ఫిడెంటుగా కనిపిస్తుండటంతో ఈసారి ఏమైనా మ్యాజిక్ జరుగుతుందేమో అన్న ఆశ పూరి అభిమానుల్లో కనిపిస్తోంది. పూరి లాంటి దర్శకులకు లక్షల్లో డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అతడిపై అభిమానం అంత సులువుగా పోయేది కాదు. ఎన్ని ఫ్లాపులిచ్చినా.. ఈసారైనా హిట్ కొడతాడేమో అని ప్రతిసారీ ఆశగా ఎదురు చూస్తారు. ‘ఇస్మార్ట్ శంకర్’ మీద కూడా అలాంటి ఆశలే ఉన్నాయి.

ఎప్పట్లాగే జెట్ స్పీడుతో తన కొత్త సినిమాను పూర్తి చేసేస్తున్నాడు పూరి. ఇంకో నెలా నెలన్నరలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందని అంటున్నారు. అప్పుడే సినిమా టీజర్ కూడా రెడీ చేసేశాడు పూరి. మే 15న రామ్ పుట్టిన రోజును పురస్కరించుకుని టీజర్ లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా జనాల దృష్టి ఈ టీజర్ మీద పడింది. ‘ఇస్మార్ట్ శంకర్’ అనే టైటిల్, రామ్ లుక్ అవీ చూస్తే పూరి గత సినిమాలకు భిన్నంగా ఏమీ ఉండదేమో అనిపించింది. రొటీన్‌గా లాగించేయాలని అనుకుంటే మాత్రం పూరికి మరోసారి దిమ్మదిరగడం ఖాయం. ఈసారైనా ఎంతో కొంత కొత్తదనం చూపించాలి. టీజర్లోనే ఏదో ఒక మెరుపు లేకుంటే జనాలు సినిమాపై ఆసక్తి చూపించడం కష్టం. మరి పూరి-రామ్‌ల ఆసక్తికర కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా టీజర్ ఏ మేరకు జనాల దృష్టిని ఆకర్షిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English