రజనీ కన్నా పవనే నయం

రజనీ కన్నా పవనే నయం

తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు గత ఏడాదే ప్రకటించాడు సూపర్ స్టార్ రజనీకాంత్‌. ఐతే ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎప్పుడో రావాల్సింది. కానీ వయసు, ఉత్సాహం ఉన్నపుడు తాత్సారం చేశాడు. కరుణానిధి, జయలలిత యాక్టివ్‌గా ఉన్నపుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి వాళ్లను ఢీకొట్టే దమ్ము రజనీకి లేకపోయింది.

కరుణానిధి అనారోగ్యంతో మంచాన పడి, జయలలిత మరణించి తమిళనాట రాజకీయ శూన్యత నెలకొన్నాక కానీ రజనీ ధైర్యం చేయలేకపోయాడు. పోనీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించాక అయినా కార్యక్షేత్రంలోకి దిగాడా అంటే అదీ లేదు. ఈ ప్రకటన చేసి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ ఇప్పటిదాకా కనీసం పార్టీ  పేరు కూడా ప్రకటించలేదు రజనీ. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో పోటీకి కూడా దూరంగా ఉన్నాడు. నేరుగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగి ఈజీగా సీఎం అయిపోవాలన్నది ఆయన ఆలోచనగా ఉంది.

ఒకప్పుడు ఖాళీగా ఉన్న సమయంలో నెమ్మదిగా సినిమాలు చేస్తూ పోయిన రజనీ.. ఇప్పుడు రాజకీయ అరంగేట్రం ప్రకటించాక ఎన్నడూ లేని వేగంతో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందైనా సినిమాలు విడిచిపెట్టి పార్టీని ప్రకటించి దాని నిర్మాణం మీద దృష్టిపెడతాడేమో అనుకుంటే.. రజనీకి అలాంటి ఆలోచనలేమీ ఉన్నట్లుగా కనిపించడం లేదు. మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ మొదలుపెట్టాడు. వచ్చే నాలుగైదు నెలలు దీని మీదే ఉంటాడు. ఆ తర్వాత కూడా తాను సినిమా చేయబోతున్నట్లు సంకేతాలిచ్చాడు రజనీ. అసెంబ్లీ ఎన్నికల వరకు తాను సినిమాలు చేస్తూనే ఉంటానని రజనీ ప్రకటించడం విశేషం.

మరి పార్టీ సంగతేంటి అంటే.. పార్టీ పెట్టడం, నడిపించడం అంటే చిన్న విషయం కాదని ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. మన పవన్ కళ్యాణ్ ఇలా పార్టీ పెట్టాక దాని నిర్మాణం మీద దృష్టిపెట్టకపోవడం, క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో తిరగకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోతున్నారన్న అభిప్రాయం ఉంది. ఐతే కనీసం పవన్ సినిమాల్ని పూర్తిగా పక్కన పెట్టి ఎన్నికల ముందు ఏడాదంతా అంతో ఇంతో రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. కానీ రజనీ తీరు అన్యాయంగా ఉంటోంది. ఈ టైంలో సినిమాల మీద ఆయనకు ఇంత మోజేంటో అర్థం కావడం లేదు. కొన్ని నెలల ముందైనా క్షేత్రస్థాయిలోకి దిగి ఏమీ చేయకుండా, పార్టీ నిర్మాణం మీద దృష్టిపెట్టకుండా ఆయన ఏ రకంగా జనాల్ని మెప్పించి ఓట్లు పొందాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English