అభిమానులకు షాకివ్వబోతున్న నాగార్జున

అభిమానులకు షాకివ్వబోతున్న నాగార్జున

అక్కినేని నాగార్జున నుంచి సోలో హీరోగా సినిమా వచ్చి చాలా కాలం అయిపోయింది. చివరగా ఆయన హీరోగా నటించిన ‘ఆఫీసర్’ సినిమాను పరిగణనలోకి కూడా తీసుకోలేం. దాని గురించి జనాలు పెద్దగా మాట్లాడుకోకపోవడం నాగార్జునకు ఆనందాన్నే ఇచ్చి ఉంటుంది. డిజాస్టర్లకే డిజాస్టర్ అయిన ఆ సినిమా తర్వాత సోలో హీరోగా సినిమా ఒప్పుకోవడానికి చాలా సమయమే తీసుకున్నాడు నాగ్. మధ్యలో నానితో కలిసి ‘దేవదాస్’ చేసిన నాగ్.. ఇటీవలే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు-2’ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

ఐతే ఇప్పుడే చిత్రీకరణ ఆరంభమైంది కాబట్టి ఏ దసరాకో క్రిస్మస్‌కో దీన్ని రిలీజ్ చేస్తారులే అన్న ఆలోచనలో ఉన్నారు నాగార్జున ఫ్యాన్స్. కానీ ఇంకో రెండు నెలల్లోనే సినిమాను రిలీజ్ చేయడానికి నాగ్ సన్నాహాలు చేసుకుంటున్నాడన్న వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది.

మొదట నాగార్జున ఆలోచన ప్రకారం ‘మన్మథుడు-2’ను ఆగస్టులో రిలీజ్ చేయాలట. కానీ ప్రభాస్ ‘సాహో’ ఆకాశాన్నంటే అంచనాల మధ్య అదే నెలలో రిలీజవుతున్న నేపథ్యంలో ఆ నెలలో ‘మన్మథుడు-2’ను వదలడం మంచిది  కాదన్న అభిప్రాయానికి వచ్చారట. దసరా సీజన్లో ‘సైరా నరసింహారెడ్డి’  అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాలు వచ్చే అవకాశం ఉండటంతో వెనక్కి వెళ్లడానికి కూడా ఛాన్స్ లేకపోయింది. అందుకనే పోటీ తక్కువగా ఉన్న జులై నెలలోనే ‘మన్మథుడు-2’ను ప్రేక్షకుల ముందుకు తేవాలని నాగ్ భావిస్తున్నాడట.

దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ తొలి సినిమా ‘చి ల సౌ’ను నెల రోజుల్లోనే అవగొట్టేయడం విశేషం. స్క్రిప్టు విషయంలో టైం తీసుకునే రాహుల్.. మేకింగ్ చాలా వేగంగా కానిచ్చేస్తాడని తొలి సినిమాతోనే రుజువు చేసుకున్నాడు. అదే స్టయిల్లో ‘మన్మథుడు-2’ను కూడా లాగించేస్తున్నాడట. పెద్ద కాస్టింగ్, చాలా లొకేషన్లతో ముడిపడ్డ సినిమా అయినప్పటికీ పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగడం వల్ల రికార్డు వేగంతో ఈ సినిమా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. నిజంగా జులైలోనే ‘మన్మథుడు-2’ వచ్చేట్లయితే అభిమానులకు స్వీట్ షాక్ అనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English