డిజాస్ట్రస్ నవంబరు.. పరిపూర్ణం

సెప్టెంబరులో ‘లవ్ స్టోరి’ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్‌లో సందడి తీసుకొచ్చింది. ‘సీటీమార్’ కూడా పర్వాలేదనిపించింది. ఇక అక్టోబరులో దసరా సినిమాలు బాక్సాఫీస్‌కు కళ తీసుకొచ్చాయి. ఇక తెలుగు సినిమాకు పునర్వైభవం వచ్చేసినట్లే అనుకున్నారు. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన పనే లేదని భావించారు. కానీ నవంబరు నెల టాలీవుడ్‌కు పెద్ద బ్రేకే వేసింది. ఏదో శాపం ఉన్నట్లుగా కొన్నేళ్ల నుంచి ఈ నెలలో వస్తున్న సినిమాలన్నీ నిరాశ పరుస్తుండగా.. ఈ ఏడాది ఈ నెల మరీ దారుణంగా తయారైంది.

పూర్తిగా బాక్సాఫీస్ కళ తప్పేలా చేసింది నవంబరు. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా కనీస స్థాయిలోనూ ప్రభావం చూపలేదు. ఏ వారానికి ఆ వారం రిలీజైన సినిమాలన్నీ వాషౌట్ అయిపోయాయి. నెల ఆరంభంలో, దీపావలి కానుకగా వచ్చిన పెద్దన్న, మంచి రోజులు వచ్చాయి, ఎనిమీ సినిమాల్లో ఏవీ కనీస ప్రభావం చూపలేదు. పెద్దన్న, మంచి రోజులు వచ్చాయి చిత్రాలకు తొలి రోజు కాస్త సందడి కనిపించింది. కానీ బ్యాడ్ టాక్‌తో అవి అడ్రస్ లేకుండా పోయాయి. ఎనిమీకి టాక్ బాగున్నా ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇక తర్వాతి వారం వచ్చిన రాజా విక్రమార్క పూర్తిగా తేలిపోయింది.

దీంతో పోలిస్తే కాస్త మెరుగైన టాక్ తెచ్చుకున్న ‘పుష్పక విమానం’ కూడా నిలబడలేకపోయింది. తర్వాతి వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. చిన్నా చితకా చిత్రాలేవో వచ్చాయి. వెళ్లిపోయాయి. ఇక నవంబరు చివరి వారం ‘అనుభవించు రాజా’ అనే రాజ్ తరుణ్ సినిమా రిలీజైంది. అది ఏమాత్రం ఇంపాక్ట్ వేయలేదు. బ్యాడ్ టాక్‌తో మొదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ లేవు. ఆ తర్వాతా సినిమా పుంజుకోలేదు. పూర్తిగా వాషౌట్ అయిపోయింది.

శింబు సినిమా ‘ది లూప్’కు టాక్ బాగున్నా సరైన ప్రమోషన్ లేక మన ప్రేక్షకులను ఆ చిత్రం ఆకర్షించలేకపోయింది. మొత్తంగా నవంబరు నెలలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా కనీస స్థాయిలోనూ ప్రభావం చూపక బాక్సాఫీస్ వెలవెలబోయింది. ఇక ఆశలన్నీ డిసెంబరు సినిమాల మీదే. ఈ వారం రానున్న ‘అఖండ’తో మళ్లీ సందడి కనిపిస్తుందని ఆశిస్తున్నారు.