దేవరకొండ దొరికిపోయాడు

దేవరకొండ దొరికిపోయాడు

విజయ్ దేవరకొండ జనాలకు.. ముఖ్యంగా యువతకు బాగా చేరువ కావడానికి కారణం.. మిగతా హీరోలతో పోలిస్తే భిన్నంగా కనిపించే అతడి యాటిట్యూడ్, మాటతీరే. అతను మైక్ పట్టుకుంటే ఏదో ప్రసంగం ఇచ్చినట్లు ఉండదు. వన్ టు వన్ మాట్లాడుతున్నట్లుంటుంది. అతడి ప్రతి మాటలో నిజాయితీ కనిపిస్తుంది. అతిశయోక్తులు, అబద్ధాలు దాదాపుగా కనిపించవు. జనాలు అతడిని మరింతగా ఇష్టపడుతుండటానికి, రోజు రోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటానికి ఇవే కారణాలు. తాజాగా మే 9న తన పుట్టిన రోజు సందర్భంగా విజయ్ డిఫరెంట్ ప్లాన్ వేశాడు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోచి లాంటి నగరాల్లో ఐస్ క్రీమ్ బండ్లను పెట్టించి కనిపించిన వాళ్లందరికీ ఉచితంగా ఐస్ క్రీమ్‌లు పంచే కార్యక్రమం ఏర్పాటు చేశాడు. దీని వల్ల అతడికి మంచి పేరూ వచ్చింది. అతడి సినిమాలకు ప్రమోషన్‌గానూ ఉపయోగపడింది.

ఈ ఆలోచన చూసి చాలామంది హీరోలకు మైండ్ బ్లాంక్ అయినట్లుగా చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీలో. చాలా తక్కువ సమయంలో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్.. ఇలాంటి క్రేజీ ఐడియాలతో మరింతగా జనాల్లోకి దూసుకెళ్తున్నాడు. ఇదిలా ఉంటే.. తన పుట్టిన రోజుకు ఇలా ఐస్ క్రీమ్‌లు పంచడం గురించి మీడియాతో మాట్లాడుతూ.. చిన్నపుడు తన పుట్టిన రోజు సందర్భంగా స్కూల్లో పిల్లలందరికీ చాక్లెట్లు పంచుతుంటే చాలా హ్యాపీగా ఉండేదని చెప్పాడు. ఇక్కడే విజయ్ సోషల్ మీడియా జనాలకు దొరికిపోయాడు.

మే 9న ఎక్కడా కూడా స్కూల్ ఓపెన్ ఉండదు. అప్పుడు సెలవులుంటాయి. విజయ్ చదివింది పుట్టపర్తిలో అయినప్పటికీ.. అక్కడ కూడా సెలవులిచ్చేస్తే ఇంటికి వచ్చేసి ఉంటాడు. మే నెలలో పుట్టిన ఎవ్వరూ కూడా స్కూల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకునే అవకాశం ఉండదు. అలా చూస్తే విజయ్ అబద్ధం చెబుతున్నట్లే. ఎలాంటి హీరో అయినా సరే.. అయినా ట్రోల్స్ వేయడానికి అవకాశం దొరికితే నెటిజన్లు ఊరుకోరు. దీని మీద మీమ్స్ తయారు చేసి విజయ్‌ మీద కామెడీ చేస్తున్నారు. ‘గీత గోవిందం’ కోసం ఒక పాట పాడి నెటిజన్లకు దొరికిపోయిన విజయ్.. మళ్లీ ఇప్పుడు ఇలా బుక్ అయ్యాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English