హను రెడీ.. ఛాన్స్ ఇచ్చేదెవరు?

హను రెడీ.. ఛాన్స్ ఇచ్చేదెవరు?

తొలి సినిమా ‘అందాల రాక్షసి’తో తన అభిరుచిని బాగానే చాటుకున్నాడు హను రాఘవపూడి. చంద్రశేఖర్ యేలేటి శిష్యరికంతో దర్శకుడిగా మారిన అతను.. గురువులాగే టాలెంట్, టేస్ట్ ఉన్న దర్శకుడిలా కనిపించాడు. కానీ ఏం లాభం? ఒక పూర్తి సినిమాను పకడ్బందీగా తీయలేడు, బడ్జెట్ మీద నియంత్రణ ఉండదన్న విమర్శలు ఎదుర్కొన్నాడు. అతడి చివరి రెండు సినిమాలు ‘లై’, ‘పడి పడి లేచె మనసు’ పెద్ద డిజాస్టర్లయ్యాయి. ‘లై’ సినిమా విషయంలో అయినా ఓకే అనుకోవచ్చు.. ‘పడి పడి లేచె మనసు’ సినిమా మాత్రం ఇల్లాజికల్‌గా అనిపిస్తుంది. పైగా దానికి రూ.35 కోట్ల దాకా ఖర్చుపెట్టించడం అన్నది అర్థరహితం. ఈ దెబ్బతో దర్శకుడిగా అతడి ఇమేజ్ బాగా దెబ్బ తినేసింది. తనను నమ్మి అడిగినంత ఖర్చు పెట్టించిన కొత్త నిర్మాతను ముంచేయడంతో పెద్ద విలన్ అయిపోయాడు హను.

ఈ స్థితిలో హనుకు ఛాన్సులివ్వడం చాలా కష్టంగానే తయారైంది. ఐతే హను మాత్రం అదేమీ పట్టించుకోకుండా త్వరగానే తన కొత్త సినిమా పనిలో పడిపోయాడట. అతను మూడు నాలుగు నెలల కిందటే తన కొత్త సినిమా స్క్రిప్టు మొదలుపెట్టాడట. 1970 కాలంలో ఆర్మీ నేపథ్యంలో అతను ఒక కథ రాసినట్లు సమాచారం. స్క్రిప్టుకు మెరుగులు దిద్దుతున్నాడట. 1970 కాలం.. ఆర్మీ అంటుంటే మళ్లీ పెద్ద బడ్జెట్ సినిమానే ప్లాన్ చేసినట్లున్నాడు హను. మరి గత అనుభవాల దృష్ట్యా అతడిని నమ్మి సినిమా ప్రొడ్యూస్ చేసే నిర్మాత ఎవరు.. టాలెంట్ ఉన్నా పర్ఫెక్షన్ లేని హను దర్శకత్వంలో నటించడానికి ఏ హీరో హీరోయిన్లు ముందుకొస్తారు అన్నదే ప్రశ్నార్థకం. చూద్దాం మరి.. హను ఎవరిని మెప్పించి తన తర్వాతి సినిమాను పట్టాలెక్కిస్తాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English