మహర్షి టికెట్ల రేట్ల గొడవ.. దిల్ రాజు వెర్షన్ ఇదీ

మహర్షి టికెట్ల రేట్ల గొడవ.. దిల్ రాజు వెర్షన్ ఇదీ

చాన్నాళ్ల తర్వాత తెలంగాణలో ఓ సినిమాకు అదనపు షోలు పడుతున్నాయి. గురువారం రిలీజవుతున్న ‘మహర్షి’కి రెండు వారాల పాట ఉదయం పూట అదనపు షో వేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. ఈ షోకు థియేటర్ల యాజమాన్యాలు టికెట్ల రేట్లు పెంచి అమ్మడం వివాదాస్పదమైంది. ఈ విషయంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.

ప్రభుత్వం టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వలేదని.. థియేటర్ల యాజమాన్యాలు అలా ఎలా అమ్ముతాయని ఆయన ప్రశ్నించారు. దీనిపై లీగల్ యాక్షన్ కూడా తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకు అనుమతి ఇవ్వడమే గొప్ప అంటే.. ఇలా టికెట్ల రేట్లు పెంచడం అన్నది టూమచ్ అనే చెప్పాలి. ప్రభుత్వం దీనిపై యాంటీగా ఉండటంతో నిర్మాత దిల్ రాజు ఇరుకున పడ్డారు.

ఆయన బుధవారం సినిమా ప్రమోషన్ పేరుతో మీడియాను కలిసి ఈ విషయంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ధరల పెంపులో నిర్మాతగా తన ప్రమేయం ఏమీ లేదని ఆయన చెప్పడం గమనార్హం. ప్రభుత్వం నుంచి అదనపు షో వేసుకునేందుకు అనుమతి ఇస్తూ జీవో వచ్చిన తర్వాత టికెట్ల రేట్ల విషయంలో చిన్న మిస్‌ కమ్యూనికేషన్‌ జరిగిందని రాజు అన్నాడు. తెలంగాణ ప్రభుత్వం కాకుండా థియేటర్‌ యజమానులే కోర్టు ద్వారా తెలంగాణ, ఆంధ్రలో కొన్ని చోట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి తెచ్చుకున్నారన్నాడు.

ఇలాంటి భారీ బడ్జెట్‌ సినిమాలు వచ్చినప్పుడు సినిమాకి రెవెన్యూ జనరేట్‌ చేయడానికి ఉన్న అవకాశాన్ని ఎగ్జిబిటర్లు ఉపయోగించుకుంటూ కోర్టుకు వెళ్లారని.. ఇలా కొన్ని కొన్ని చోట్ల రేట్లు పెంచడం ఎప్పటినుంచో జరుగుతోందని.. ఈ ధరల పెంపు ఒక వారం రోజులు మాత్రమే ఉంటుందని రాజు చెప్పాడు. మరి నిర్మాత వెర్షన్ ఇలా ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English