సినిమా రిలీజ్ కాకుండానే సీరియల్లో..

సినిమా రిలీజ్ కాకుండానే సీరియల్లో..

ఏ మధ్యాహ్నం పూటో ఏం తోచనపుడు ఏదో ఒక టీవీ ఛానెల్ పెట్టండి. ఏదైనా సీరియల్ వస్తుంటే.. దాన్ని చూడకపోయినా పర్వాలేదు.. ఊరికే అలా ఒక చెవి అటు పడేసి మీ పని మీరు చేసుకోండి. అరగంట సీరియల్ ముగిసేలోపు.. తెలుగు సినిమాల్లోని ఎన్ని పాటలు.. బ్యాాగ్రౌండ్ స్కోర్ బిట్లు ప్లే అవుతాయో చూసుకోండి. అందులో ఎక్కడైనా కొత్త మ్యూజిక్ వినిపిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. నిన్న మొన్న రిలీజైన సినిమాల్లోని పాటలు కూడా సీరియళ్లలో వినొచ్చు.

ఈ విషయంలో సీరియళ్ల మ్యూజిక్ డైరెక్టర్లు చాలా అప్ టు డేట్‌గా ఉంటారు. ఐతే తాజాగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ మరీ అడ్వాన్స్ అయిపోయాడు. ఇంకా రిలీజ్ కూడాకాని ‘మహర్షి’ సినిమా నుంచి రెండు రోజుల కిందటే ‘ఇదే కదా ఇదే కదా నా కథ’ అంటూ ఓ పాట రిలీజైతే దాన్ని కాపీ చేసి పెట్టేశాడు. ఆ సీరియల్ పేరేంటి.. వివరాలేంటన్నవి తెలియదు కానీ.. ఎవరో ఈ పాట ప్లే అవుతున్నపుడు వీడియో క్యాప్చర్ చేసి ట్విట్టర్లో పెట్టారు. అది చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇంకా రిలీజ్ కూడా కాని సినిమా నుంచి ఇలా పాట కాపీ కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఐతే ఇలా సినిమాల్లోని పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను సీరియళ్ల వాళ్లు యథేచ్చగా కాపీ కొట్టడం కొత్తేమీ కాదు. చాలా ఏళ్లుగా నడుస్తోందీ వ్యవహారం. కొందరైతే ఫుల్ సాంగ్స్ యాజిటీజ్ పెట్టేస్తుంటారు. సీరియళ్లలో హీరో హీరోయిన్ల మీద పాటలు నడిపించేస్తుంటారు. ఈ విషయంలో నియంత్రణ అన్నది కొరవడింది.

గతంలో ఒకసారి సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ విషయంలో ఫైర్ అయ్యారు. ఇలా సినిమా పాటల్ని తమ అనుమతి లేకుండా ఇష్టానుసారం వాడుకునే హక్కు మీకెవరిచ్చారని ప్రశ్నించాడు. దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తానన్నాడు. కానీ ఆయనకు ఇండస్ట్రీ నుంచి సరైన మద్దతు లభించలేదు. సినీ పరిశ్రమను శాసిస్తున్న చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్ల ఆధ్వర్యంలో నడిచే మా టీవీలోనే చాలా సీరియళ్లలో ఇలా సినిమా పాటలు, నేపథ్య సంగీతాన్ని ఇష్టానుసారం వాడేస్తుంటారు. ఇక సినీ జనాలు ఎవరిని నిలదీస్తారు. ఈ విషయంలో ఎలా నియంత్రణ తీసుకొస్తారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English