బడ్జెట్ పెరిగితే.. ప్రేక్షకులు భరించాలా?

బడ్జెట్ పెరిగితే.. ప్రేక్షకులు భరించాలా?

ఏడాదిలో వందకు తక్కువ కాకుండా సినిమాలు రిలీజవుతాయి తెలుగులో. అందులో అన్ని సినిమాలకూ తెలంగాణలో ఒకటే రేట్లు ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌‌లో మాత్రం కథ వేరుగా ఉంటుంది. అందులో 90 సినిమాలకు మాత్రం ఒక రేటు.. ఓ పది సినిమాలకు మాత్రం ఇంకో రేటు. అవి పెద్ద స్టార్లు నటించిన భారీ చిత్రాలు. ఆ సినిమాల్లో మాత్రం ప్రపంచ సినీ చరిత్రలోనే ఎవ్వరూ చూడని అద్భుతాలు చూపించేస్తున్నట్లుగా వాటికి ప్రత్యేకమైన రేట్లు ఉంటాయి.

తొలి వారంలో ఆ సినిమాలు చూడాలంటే డబుల్ రేట్లు పెట్టాలట. ఇదేమీ బ్లాక్‌లో అనధికారికంగా అమ్మే రేటు కాదు. అఫీషియల్‌గానే ఈ ధర పెట్టి కొనాల్సి ఉంటుంది. నిర్మాతలు ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే చాలు. కళ్లు మూసుకుని అనుమతులు వచ్చేస్తాయి. ఇండియాలో ఇంకెక్కడా చూడని విడ్డూరం ఇది. కేవలం ఏపీ ప్రభుత్వం మాత్రమే ఈ అధికారిక దోపిడీకి యథేచ్ఛగా అనుమతులు ఇచ్చేస్తుంది. ఇదేం న్యాయమని అడిగే ప్రేక్షకులకు సమాధానం చెప్పే వాళ్లు ఉండరు.

తెలుగులో తెరకెక్కే ప్రతి భారీ సినిమాకూ ఈ దందా కామన్ అయిపోయింది. కొన్నేళ్ల నుంచి ఇలా తొలి వారంలో టికెట్లు పెంచుకోవడానికి, అదనపు షోలు వేసుకోవడానికి అనుమతులు ఇచ్చేస్తోంది ఏపీ సర్కారు. అదనపు షోలు వేసుకుంటే ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఏం హక్కు ఉంది.. దానికి ప్రభుత్వం ఏ కారణంతో అనుమతి ఇస్తోందన్నది అర్థం కాని విషయం. పవన్ కళ్యాణో.. మహేష్ బాబో.. నందమూరి బాలకృష్ణనో సినిమా చేస్తే అందులో ఏమైనా ఎవ్వరూ చూడని అద్భుతాలు చూపించేస్తారా? ఆయా సినిమాల బడ్జెట్లు పెరిగిపోతే దానికి ఎవరు బాధ్యులు? ఆ రిస్క్ నిర్మాతలే చూసుకోవాలి. అంతే కానీ.. ఇంత ఖర్చు పెట్టి తీశాం కాబట్టి ఆ భారాన్నంతా జనాల మీదికి రుద్దుతామంటే ఎలా? ఇప్పుడు మహేష్ బాబు సినిమా ‘మహర్షి’కి టికెట్ల రేట్లు డబుల్ చేసేస్తున్నారు.

తొలి వారమంతా ఏకంగా రూ.200 పెట్టి టికెట్ కొనాలట. మహేష్ బాబైతే మాత్రం ఏంటి గొప్ప? అతడి సినిమా చూడటానికి డబుల ్ రేటి పెట్టి థియేటర్లకు వెళ్లాలా? అసలు ఏపీ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇస్తోందన్నదే అర్థం కాని విషయం. ఒక సినిమా టీం కోసం లక్షలమంది ప్రేక్షకుల జేబులకు చిల్లుపెట్టడాన్ని ఏమనాలి? ఎక్కడా లేనిది ఆంధ్రాలో మాత్రమే సాగుతున్న ఈ దోపిడీకి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుంది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English