తమ్ముడిని వదిలేశాడు.. కొడుకుని ప్రమోట్ చేస్తున్నాడు

తమ్ముడిని వదిలేశాడు.. కొడుకుని ప్రమోట్ చేస్తున్నాడు

మంచి బ్యాగ్రౌండ్ ఉంది.. ప్రతిభ కూడా ఉంది. అయినా కూడా సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ సరైన అవకాశాలు అందుకోలేకపోయాడు. అతడి కెరీర్లో మ్యూజికల్ హిట్లు చాలానే ఉన్నప్పటికీ కెరీర్ ఊపందుకోలేదు. కళ్యాణి మాలిక్.. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి తమ్ముడన్న సంగతి తెలిసిందే. కానీ అతను అన్న పేరును ఎప్పుడూ వాడుకోలేదు. కీరవాణి కూడా తమ్ముడిని ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు. అతడికి అవకాశాలు ఇప్పించలేదు.

కొన్నిసార్లు తమ్ముడికి దక్కాల్సిన అవకాశాలు కీరవాణికి వెళ్లిపోయాయన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఐతే బంధుప్రీతి లేకపోవడం వల్లే కీరవాణి తమ్ముడిని ప్రమోట్ చేయలేదని, ఎవరికీ రెకమండ్ చేయలేదని అనేవాళ్లూ లేకపోలేదు.

అదే నిజమనుకుంటే తన కొడుకు కాలభైరవ విషయంలో మాత్రం కీరవాణి భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది. కాలభైరవను మొదట్నుంచి కీరవాణి బాగా ప్రమోట్ చేస్తున్నాడు. తన సినిమాల్లో అతడికి గాయకుడిగా వరుసగా అవకాశాలు ఇచ్చాడు. వేరే సినిమాల్లో ఛాన్సులు రావడానికి కూడా ఆయనే కారణమని అంటారు. ఇప్పుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా మారడంలోనూ కీరవాణి ప్రమేయం ఉందంటున్నారు.

చందూ మొండేటి, నిఖిల్ సిద్దార్థ కాంబినేషన్లో రాబోతున్న ‘కార్తికేయ-2’కు కాలభైరవనే సంగీత దర్శకుడట. చందూ గత సినిమా ‘సవ్యసాచి’కి కీరవాణే మ్యూజిక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి పరిచయంతోనే ‘కార్తికేయ-2’ ఛాన్స్ కొడుక్కి ఇప్పించాడట కీరవాణి. అంతే కాక ఈ సినిమా సంగీతాన్ని తాను పర్యవేక్షిస్తానని.. ఒకట్రెండు ట్యూన్లు కూడా తానే అందిస్తానని కూడా హామీ ఇచ్చాడట. ఈ నేపథ్యంలో ఎంతో ప్రతిభ ఉన్న తమ్ముడిని పట్టించుకోని కీరవాణి.. కొడుకుని మాత్రం బాగానే పైకి లేపుతున్నాడనే కామెంట్లు చేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English