కేసీఆర్ వ్యూహ‌మేంటో చూద్దాం.. ఏపీ స‌ర్కారు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

“కేసీఆర్ ఏం చేస్తారో చూద్దాం. స‌మ‌స్య మ‌న‌కు మాత్ర‌మే కాదు. అంద‌రికీ ఉంది. ముందుగా ఆయ‌న గ‌ళం విప్పారు.. ఇప్పుడు ఏం జ‌రుగుతుందో చూసి..మ‌నం కూడా గ‌ళం విప్పుదాం!“ ఇదీ.. ఏపీ ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు.. అత్యంత‌కీల‌కంగా మారిన వ‌రి పంట విష‌యంలో మంత్రుల‌కు చేసిన సూచ‌న‌. అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం.. ఆరు మాసాల కింద‌టే.. దేశంలో వ‌రి వేయొద్దంటూ.. తీర్మానం చేసింది. దీనిని అన్ని రాష్ట్రాల‌కూ పంపించింది. అయితే.. ఈ ప‌రిస్థితిని త‌ర్వాత‌.. స‌మీక్షించుకుని.. కొంత ఉదారంగా ఉంటుంద‌ని.. ద‌క్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా వ‌రి పంట‌లో కీల‌కంగా ఉన్న తెలంగాణ‌, ఏపీ, కేర‌ళ వంటివి భావించాయి. అయితే.. ఈ విష‌యంలో తాము వెన‌క్కి త‌గ్గేది లేద‌ని.. కేంద్రం స్పష్టం చేసింది.

మ‌రోప‌క్క‌, వ‌రి నాట్లు ప్రారంభం అవుతున్నాయి. ఇప్ప‌టికే తెలంగాణ అన‌ధికారికంగా కొంత‌.. అధికారికంగా కొంత‌.. వ‌రి వేయొద్దంటూ.. ఆదేశాలు ఇచ్చేశారు. క‌లెక్ట‌ర్లు ఈ విష‌యంలో సీరియ‌స్‌గానూ ఉన్నారు. వ‌రి వేయొద్దంటూ.. రైతుల‌ను హెచ్చరిస్తున్నారు. అయితే.. కేంద్రం చెప్పిన‌ట్టు వ‌రి స్థానంలో ప్ర‌త్యామ్నాయ పంట‌ల దిశ‌గా అయినా.. ప్రోత్స‌హిస్తున్నారా? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో రైతులు తీవ్ర‌స్థాయిలో ఇబ్బందులు ప‌డుతున్నారు. దీంతో ఇది రాజ‌కీయంగా కూడా కేసీఆర్ ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది. దీంతో నేరుగా రంగంలోకి దిగిన ఆయ‌న స్వ‌యంగా ధ‌ర్నా చేయ‌డం.. దేశంలో అగ్గిపెడ‌తాన‌న‌డం తెలిసిందే. నిజానికి ఇదే స‌మ‌స్య ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ కూడా టాప్‌లో ఉంది.

కానీ, ఇక్క‌డ ప్ర‌భుత్వం నేరుగా కేంద్రంపై ఆరోప‌ణ‌లు చేయ‌డం లేదు. కేంద్రం నుంచి ఆర్థికంగా అప్పులు కావొచ్చు.. నిదులు కావొచ్చు.. ఏపీ స‌ర్కారుకు సాయం కావాల్సిన ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో నేరుగా త‌ల‌ప‌డ‌డం కంటే.. పోరాడే వారితో క‌లిసి చేతులు క‌లిపితే బెట‌రేమో! అనే ఆలోచ‌న చేస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల్లో విష‌యాన్ని చూచాయ‌గా చెప్పేశారు. ఈ ద‌ఫా వ‌రి వేయొద్దంటూ.. వ్య‌వ‌సాయ మంత్రి క‌న్న‌బాబు స్ప‌ష్టం చేశారు. అయితే.. అది .. బోర్ల కింద సాగుకు మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని ప్ర‌క‌టించారు.కానీ, వాస్త‌వానికి ఎలాంటి సాగుకైనా వ‌రి వ‌ద్ద‌నేది.. ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యం. కానీ, నిమ్మ‌ళంగా ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంది.

ఇదే విష‌యంపై రేపు ప్ర‌తిప‌క్షాలు నిల‌దీసే ప్ర‌మాదం ఉంద‌ని.. ముఖ్యంగా రాజ‌న్న రాజ్యం, రైతు ప్ర‌భుత్వంగా చేసుకుంటున్న ప్ర‌చారానికి ఇది విఘాతం క‌లిగించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. ఈ క్ర‌మంలోనే నేరుగా కేంద్రంపై త‌ల‌ప‌డ‌డం కాకుండా.. పొరుగు రాష్ట్ర అధినేత .. కేసీఆర్ ఎలాగూ.. గ‌ళం విప్పారు క‌నుక‌.. రాబోయే రోజుల్లో ఆయ‌న అనుస‌రించే పంథాను ప‌రిశీలించి.. దానికి అనుగుణంగా అడుగులు వేయాల‌ని.. ప్ర‌భుత్వ పెద్ద‌లు మంత్రుల‌కు సూచించారు. ఈ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యానికైనా.. సిద్ధ‌మ‌య్యేలా.. ఎంపీలు కూడా రెడీ అవ్వాల‌ని..దిశానిర్దేశం చేశారు. మ‌రి .. దీనిని బ‌ట్టి కేసీఆర్ అడుగుల్లో ఏపీ అడుగులు వేయ‌నుందా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.