అప్పుడు దిల్ రాజు.. ఇప్పుడు .జీవిత

అప్పుడు దిల్ రాజు.. ఇప్పుడు .జీవిత

ఆ మధ్య తన మిత్రుడు, నిర్మాణ భాగస్వామి అయిన బెక్కెం వేణుగోపాల నిర్మించిన ‘హుషారు’ సినిమాకు సంబంధించిన ఒక వేడుకకు హాజరై ఆ సినిమా పోస్టర్లు చూసి కొంచెం నెగెటివ్‌గా మాట్లాడాడు దిల్ రాజు. ఈ రోజు యూత్ కోసం తీసే సినిమాలంటే చాలా బోల్డ్‌గా ఉంటున్నాయని.. అవే సక్సెస్ అవుతుండటంతో తాను కూడా అలాంటివే తీయాలేమో అనిపిస్తోందని అన్నాడు రాజు. ఐతే రాజు చాలా వరకు సుతి మెత్తగానే మాట్లాడాడు  ఆ రోజు.

ఐతే ఇప్పుడు ఒక సినిమా వేడుకకు వెళ్లి ఆ చిత్ర బృందానికి గట్టిగా క్లాస్ పీకేసింది జీవిత రాజశేఖర్. ఇలాంటి సినిమాలతో సమాజానికి ఏం సందేశం ఇస్తారు అనేలాగా ఆమె మాట్లాడటం గమనార్హం. ‘1947లో ఒక గ్రామం’, ‘కమలతో నా ప్రయాణం’ లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలు తీసిన నరసింహ నంది నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘డిగ్రీ కాలేజ్’ ట్రైలర్‌ను జీవితనే లాంచ్ చేసింది.

ఐతే ట్రైలర్ లాంచ్ చేయడాానికి ముందు అది జీవిత చూసుకున్నట్లు లేదు. అప్పుడే ట్రైలర్ చూసిన ఆమె ఒకింత షాక్ అయింది. ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలు సక్సెస్ అయ్యాక అన్నీ అలాంటి సినిమాలే వస్తున్నాయని.. ముద్దులు, ఇంటిమేట్ సీన్లు లేకుండా సినిమాలు తీయట్లేదని జీవిత అంది. తాను కేంద్ర సెన్సార్ బోర్డులో సభ్యురాలినని.. అలాంటి తనను ఇలాంటి ట్రైలర్ లాంచ్ చేయడానికి పిలవాల్సింది కాదని జీవిత అంది. మామూలుగా మన ఇళ్లలో స్నానం బాత్రూంలో చేస్తామని, శృంగారం బెడ్ రూంలో జరుగుతుందని.. హాల్లో మామూలుగా వచ్చి కూర్చుంటామని.. సినిమా హాల్ కూడా ఇంట్లో హాల్ లాంటిదే అని.. అక్కడ శృంగారం, స్నానం లాంటివి చూపించకూడదని ఆమె అంది. శృంగారం అందరి జీవితంలో భాగమే అయినప్పటికీ.. దాన్ని ఓపెన్ చేసి చూపించకూడదని, ఏదైనా మరుగున ఉంటేనే అందమని ఆమె చెప్పింది.

తాను ఒక బిడ్డకు తల్లిగా మాట్లాడుతున్నానని.. సినిమాలు తీసేవాళ్లు కొంచెం బాధ్యతాయుతంగా ఉండాలని ఆమె అంది. మొత్తానికి తీవ్ర స్వరంలో చెప్పకపోయినా.. కొంచెం గట్టిగానే ‘డిగ్రీ కాలేజ్’ టీంకు ఆమె క్లాస్ పీకింది. ఐతే సినిమాలో రొమాన్స్ పది శాతమే ఉంటుందని.. మిగతాదంతా మంచి కథ ఉంటుందని దర్శకుడు కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English