గాలి మేడలు కూలిపోయాయి

గాలి మేడలు కూలిపోయాయి

నందమూరి బాలకృష్ణ మార్కెట్ చాలా ఏళ్ల పాటు 30-35 కోట్ల మధ్యే ఉంది. ఒకప్పుడు ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘లెజెండ్’ కూడా రూ.40 కోట్ల షేర్ లోపే రాబట్టింది. ఐతే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ స్పెషల్ ఫిలిం కావడంతో దాని బడ్జెట్ పెంచారు. వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. అంతమాత్రాన బాలయ్య మార్కెట్ పెరిగిపోయిందని అనుకుంటే పొరబాటే.

‘శాతకర్ణి’ తర్వాత బాలయ్య నుంచి వచ్చిన ‘జై సింహా’కు బిజినెస్ సగానికి సగం పడిపోయింది. కానీ ‘యన్.టి.ఆర్’ సినిమాకు అనూహ్యమైన క్రేజ్ రావడంతో దానికి ఊహించని స్థాయిలో బిజినెస్ చేసుకున్నారు. ఇది రెండు భాగాలుగా తెరకెక్కగా.. ఒక పార్టుకే రూ.70 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగడం అనూహ్యం. దీంతో బాలయ్య తన గురించి తాను ఎక్కువగానే ఊహించుకున్నట్లున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తాను చేయాలనుకున్న తర్వాతి సినిమాకు ఏకంగా రూ.60 కోట్ల బడ్జెట్ లెక్కలు వేసుకున్నాడు.

బాలయ్య ‘యన్.టి.ఆర్’ చేస్తున్న సమయంలోనే బోయపాటి ‘వినయ విధేయ రామ’ తీశాడు. ఆ సినిమాకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. బిజినెస్ కూడా ఓ రేంజిలో జరిగింది. బోయపాటి స్థాయి కూడా చూసుకుని బాలయ్య గాలి మేడలు కట్టేశాడు. కానీ ఈ మేడలు కూలిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ‘యన్.టి.ఆర్’ తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక నష్టాలు తెచ్చిన సినిమాల్లో ఒకటి అయింది. ఆకాశంలో ఉన్న బాలయ్య కాస్తా నేల మీదికి దిగి పాతాళానికి పడ్డాడు.

బోయపాటి పరిస్థితి కూడా అంతే. దెబ్బకు ఇప్పుడు వీళ్ల కాంబినేషన్లో సినిమాకు బడ్జెట్ లెక్కలన్నీ మారిపోయాయి. బడ్జెట్‌ను సగానికి సగం తగ్గించుకుంటే తప్ప వర్కవుటయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 60 కోట్లు పెడితే అంతే సంగతులని అర్థమైంది. కష్టం మీద బోయపాటి దీని బడ్జెట్‌ను రూ.40 కోట్ల వరకు తగ్గించినట్లు సమాచారం. ప్రస్తుతం డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ హక్కులకు మంచి రేటు వస్తోంది కాబట్టి ఈ బడ్జెట్ వర్కవుట్ కావచ్చు కానీ.. లేదంటే రూ.30 కోట్లకు మించి బాలయ్య సినిమాల మీద పెట్టే పరిస్థితి లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English