టాలీవుడ్ రీఎంట్రీ మామూలుగా ఉండదట

టాలీవుడ్ రీఎంట్రీ మామూలుగా ఉండదట

పేరుకు తమిళుడే కానీ.. ఒకప్పుడు సిద్దార్థ్‌ను అందరూ తెలుగు హీరోలాగే గుర్తించారు. ఇక్కడే అతను మంచి ఇమేజ్, ఫాలోయింగ్ సంపాదించి స్టార్ హీరో లాగా చెలామణి అయ్యాడు. అప్పట్లో యూత్‌ అతడి సినిమాలంటే పడి చచ్చేవాళ్లు. ‘బాయ్స్’తో మామూలుగానే ఎంట్రీ ఇచ్చినప్పటికీ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు సిద్ధు. కానీ ఆ తర్వాత తన స్థాయికి తగ్గ సినిమాలు చేయకపోవడంతో ఉన్న క్రేజ్ అంతా పోయింది. చివరికి టాలీవుడ్ ఖాళీ చేసి వెళ్లిపోయాడు. మాతృభాష తమిళంలో తన అభిరుచికి తగ్గ సినిమాలు చేసుకుంటున్నాడు. ఐతే అక్కడ కూడా ఇప్పుడు అతడి కెరీర్ ఏమంత గొప్పగా లేదు. ఒక దశలో తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా దూరం అయిపోయిన సిద్ధు..ఆ మధ్య ‘గృహం’ సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత సిద్ధు అడ్రస్ లేడు. తాజాగా అతను మన కమెడియన్ సునీల్‌తో ఒక ఫొటో దిగి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా తెలుగు ఫ్యాన్స్ సిద్ధును ఇక్కడికి మళ్లీ ఎప్పుడొస్తావు అని అడిగారు. దానికి సిద్ధు తెలుగులోనే బదులివ్వడం విశేషం. తన గురించి ఎవరు ఏమన్నా తాను తెలుగులోకి తిరిగి రావడం గ్యారెంటీ అని సిద్ధు చెప్పాడు. ఇక్కడి ప్రేక్షకులకు ది బెస్ట్ ఇవ్వడానికే తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. తనకు తెలుగు ప్రేక్షకులు 18 నెలలు సమయం ఇవ్వాలని.. వాళ్లను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు గురి చేయనని అతను చెప్పాడు.

ప్రస్తుతం తాను చాలా కష్టపడి ఒక ప్రాజెక్టు  మీద పని చేస్తున్నానని.. గొప్ప కంటెంట్‌తో రీఎంట్రీ ఇవ్వబోతున్నానని అన్నాడు. సిద్ధు అలా అనేసరికి ఏడాదిన్నర సమయం తీసుకుని ఒక ప్రాజెక్టు మీద పని చేస్తున్నాడంటే.. అది చాలా స్పెషలే అయ్యుంటుందని అనుకుంటున్నారు. ‘గృహం’ సినిమాకు సీక్వెల్ తీస్తానని గతంలో ప్రకటించాడు సిద్ధు. కానీ తర్వాత దాని ఊసెత్తలేదు. మరి ఇప్పుడు చేయబోయేది ఆ సినిమానేనా లేదంటే ఇంకేదైనా కొత్త ప్రయత్నం చేస్తున్నాడా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English