మీడియాకు కేసీఆర్‌ రిట‌ర్న్ గిఫ్ట్‌...రామోజీ వంతు వ‌చ్చేసింది

మీడియాకు కేసీఆర్‌ రిట‌ర్న్ గిఫ్ట్‌...రామోజీ వంతు వ‌చ్చేసింది

రిట‌ర్న్ గిఫ్ట్ పేరుతో త‌న ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేస్తున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ క్ర‌మంలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారా? ఇప్పటివ‌ర‌కు త‌న రాజ‌కీయ‌ ప్ర‌త్య‌ర్థులుగా ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు, తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌ను టార్గెట్ చేసిన కేసీఆర్‌...ఇప్పుడు మీడియాను త‌దుప‌రి ల‌క్ష్యంగా పెట్టుకున్నారా? ఇందులో భాగంగా, మీడియా మొఘ‌ల్ రామోజీరావుపై ఆయ‌న ఎదురుదాడి మొద‌లైందా? ఇన్నాళ్లు ప‌రోక్షంగా టార్గెట్ చేసిన ఇప్పుడు ప్ర‌త్య‌క్షంగా టార్గెట్ చేస్తున్నారా?ఈ చ‌ర్చ‌లు ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ‌, మీడియా స‌ర్కిల్ల‌లో జోరుగా సాగుతున్నాయి.

ఈ కీల‌క చ‌ర్చ‌కు తెర‌లేసేందుకు కార‌ణం...టీఆర్ఎస్ పార్టీకి అండ‌గా ఉండే దిన‌ప‌త్రిక అనే పేరున్న`న‌మ‌స్తే తెలంగాణ‌`లో వ‌చ్చిన క‌థ‌నం. ఈనాడు దిన‌ప‌త్రిక‌ను నేరుగా టార్గెట్ చేస్తూ, అందులో రాసిన వార్త‌. ఇటీవ‌లి వ‌ర‌కు కొన్ని మీడియా సంస్థ‌లు చంద్ర‌బాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నాయని కేసీఆర్ విమ‌ర్శించేవారు. అయితే, తాజాగా ఆయ‌న అనుకూల ప‌త్రిక‌లో ఘాటు వ్యాఖ్య‌ల‌తో ఈనాడును నేరుగా టార్గెట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. "ఏటిగడ్డ కిష్టాపూర్‌ను ఖాళీ చేయాలని హైకోర్టు చెప్పినట్టు ఈనాడు మొదటిపేజీలో బ్యానర్ వార్త రాసింది. కానీ హైకోర్టు ఎక్కడా ఆ విషయం చెప్పలేదు. యంత్రాలు, అధికారులు ఆ దరిదాపుల్లో ఉండొద్దని ఆదేశించినట్టు ఈనాడు పేర్కొంది. కానీ హైకోర్టు న్యాయమూర్తులు ఆ విషయం చెప్పలేదు.

హైకోర్టు చెప్పిన విషయాలేవీ ఈనాడులో రాయలేదు. ఈనాడు రాసిన విషయాలేవీ ఇవ్వాళ ఏ పత్రికలూ రాయలేదు. ఈనాడుకు మాత్రమే ఏటిగడ్డ కిష్టాపూర్ ఖాళీ చేయమని హైకోర్టు చెప్పినట్టు కలవచ్చిందా? అలా కావాలని ఈనాడు కోరుకుంటున్నదా? తెలంగాణ ప్రాజెక్టులు ఆగిపోవాలని తహతహలాడుతున్నదా? ఈనాడు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ఏ అక్కసు? ఏ సంకుచితం? ఏ కడుపుమంట? ఇటువంటి రాతలకు కారణమవుతున్నది? తెలంగాణ ప్రాజెక్టులు ముందు పడకూడదా? కోర్టు చెప్పని మాటలను, న్యాయమూర్తులు అనని మాటలను పత్రిక పతాక శీర్షికల్లో రాయడానికి ఎంత దుస్సాహసం కావాలి? కోర్టు ధిక్కారం కిందికి వస్తుందన్న భయం కూడా లేదా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.

టీఆర్ఎస్ పార్టీ పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో వార్త‌లు వ‌స్తాయ‌నే ప్ర‌చారం ఉన్న నేప‌థ్యంలో...వారి అనుమ‌తి లేకుండా ఈ స్థాయిలో ఈనాడు ప‌త్రిక‌పై ఇంత పెద్ద ఎత్తున నేరుగా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తారా అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. ఒక‌వేళ పార్టీ పెద్ద‌లే ఈ రేంజ్‌లో టార్గెట్ చేస్తే...దీన్ని మీడియాకు కేసీఆర్ ఇచ్చిన రిట‌ర్న్ గిఫ్ట్ భావించాలా అంటూ కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English