దారి మళ్లిన నిధులు…వైసీపీ ఎంపీపై కేంద్రం సీరియస్

ఏపీ ప్రభుత్వంపై తాజాగా కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై గతంలో పంపిన లేఖకు వివరణనివ్వడంలో జాప్యం జరగడంపై అసహనం వ్యక్తం చేసింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్…తన ఎంపీ లాడ్స్ నిధులను చర్చిల నిర్మాణం కోసం ఖర్చు చేశారన్న ఆరోపణలపై వెంటనే నివేదిక పంపాలని కేంద్రం ఆదేశించింది. ఈ ప్రకారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శికి విడివిడిగా లేఖలు పంపింది.

ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీలో క్రిస్టియానిటీ పెరిగిపోయిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ వ్యవహారంపై గణాంకాలతో సహా రాష్ట్రపతికి, ప్రధానికి రఘురామ లేఖ కూడా రాశారు. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు పైకి హిందువుల నిరంతరం చర్చిల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే చర్చి నిర్మాణానికి తన ఎంపీ లాడ్స్ ఫండ్స్ ను వైసీపీ ఎంపీ  నందిగం సురేష్ ఖర్చు చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి.

ఆ కథనాలను ఉటంకిస్తూ ప్రధాని మోడీకి రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. దీంతో, ఆ లేఖపై నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి 2 నెలల క్రితం గణాంకాలు, ప్రణాళిక శాఖ లేఖ పంపింది. కానీ, ఆ వ్యవహారంపై ఇప్పటిదాకా ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో, తాజాగా ఏపీ సీఎస్‌కు గణాంకాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమ్య మరో లేఖ పంపారు. త్వరగా సవివరమైన నివేదిక పంపాలని కోరారు. ప్రధాని కార్యాలయానికి నివేదిక ఇవ్వాల్సి ఉందని వివరించారు.