మంచు విష్ణుకు, ‘ఓటరు’ దర్శకుడికి గొడవ

 మంచు విష్ణుకు, ‘ఓటరు’ దర్శకుడికి గొడవ

మంచు విష్ణు నుంచి సిినిమా వచ్చి చాలా కాలం అయిపోయింది. అతను ‘ఓటరు’ అనే సినిమాలో నటించడం.. అది చాలా కాలంగా విడుదలకు నోచుకోకుండా ఆగి ఉండటం తెలిసిన సంగతే. ఐతే ఈ సినిమా విషయంలో విష్ణుకు, దర్శకుడు కార్తీక్ రెడ్డికి పెద్ద గొడవ నడుస్తున్న విషయం వెల్లడైంది. ఈ చిత్ర దర్శకుడు కార్తీక్ రెడ్డి తనకు కోటిన్నర రూపాయలు ఇవ్వాలని విష్ణు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తుండటం గమనార్హం.

ఇంతకీ విషయం ఏంటంటే.. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఓటరు’ చిత్రానికి ‘అసెంబ్లీ రౌడీ’తో పోలికలు ఉన్నాయట. ‘అసెంబ్లీ రౌడీ’ స్క్రీన్ ప్లేను అడాప్ట్ చేసుకుని ఈ సినిమా తీశారట. ఐతే ‘అసెంబ్లీ రౌడీ’ మోహన్ బాబు సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన సినిమా అన్న సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమా కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా తీసుకున్నందుకు గాను తమకు కోటిన్నర రూపాయలు ఇచ్చేటట్లు కార్తీక్ రెడ్డితో మంచు విష్ణు అగ్రిమెంట్ రాసుకున్నాడట. ఐతే ఇప్పుడు ఈ అగ్రిమెంటన్‌ను ఆనర్ చేయట్లేదని, డబ్బులు ఇవ్వలేమని చేతులెత్తేశాడని విష్ణు సన్నిహితుడైన విజయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి మీడియాకు చెప్పాడు.

ఐతే కార్తీక్ రెడ్డి వాదన వేరుగా ఉంది. తాను రాసుకున్న కథ, ‘అసెంబ్లీ రౌడీ’కి ఏ సంబంధం లేదని.. కానీ విష్ణునే ఆ సినిమా స్క్రీన్ ప్లే అడాప్ట్ చేసుకుందామని చెప్పి ఒత్తిడి చేశాడని, తనతో కోటిన్నర రూపాయలకు బలవంతంగా అగ్రిమెంట్ రాయించి సంతకం పెట్టించాడని.. ఆ తర్వాత తనకు కథ, స్క్రీన్ ప్లేలో క్రెడిట్ ఇవ్వాలని డిమాండ్ చేశాడని, ఐతే అతడి ఒత్తిడి తట్టుకోలేక స్క్రీన్ ప్లే క్రెడిట్ మాత్రం ఇచ్చానని.. ఇప్పుడు తన కెరీర్ నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కార్తీక్ అంటున్నాడు. మరి ఈ గొడవ విషయంలో విష్ణు అఫీషియల్‌గా ఏం చెబుతాడన్నది చూడాలి. అసలు క్రేజ్ లేని, బిజినెస్ కాని సినిమా గురించి ఈ గొడవేంటన్నదే అర్థం కాని విషయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English