మహర్షి గొడవ.. ఏం లేదు ఏం లేదు

మహర్షి గొడవ.. ఏం లేదు ఏం లేదు

కొంత కాలంగా ‘మహర్షి’ సినిమా నెగెటివ్ వార్తలతోనే చర్చల్లో ఉంటోంది. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదని, బడ్జెట్ హద్దులు దాటిపోయిందని.. దీంతో ఆదాయ పంపకాల విషయంలో ముగ్గురు నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీల మధ్య విభేదాలు నెలకొన్నాయని గుసగుసలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఆరంభ సమయంలో కూడా పెద్ద వివాదం నడిచిన సంగతి తెలిసిందే.

ముందు తన బేనర్లో సినిమా తీయడానికి ఒప్పందం కుదుర్చుకుని.. తమ ఆఫీసులో, తమ ఖర్చుతో స్క్రిప్ట్ వర్క్ చేసి.. చివరికి దిల్ రాజుతో సినిమా చేయడానికి వంశీ వెళ్లిపోవడంపై పీవీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం, కోర్టుకు కూడా వెళ్లడం.. చివరికి గొడవ పెద్దది కావడంతో మరో మార్గం లేక పీవీపీని ఈ సినిమాలో భాగస్వామిని చేసుకోవడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ‘మహర్షి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ముగ్గురు నిర్మాతలు ఎలా వ్యవహరిస్తారో.. ఎంత కలివిడిగా ఉంటారో.. ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఐతే రాజు, దత్, పీవీపీ తమ మధ్య ఏ గొడవా లేదన్నట్లుగానే ప్రవర్తించారు. చక్కటి సమన్వయంతో కనిపించారు. ముగ్గురూ చాలా పాజిటివ్‌గా మాట్లాడారు. ఇన్నాళ్లూ ‘మహర్షి’తో తమకు సంబంధం లేదన్నట్లుగా ఉన్న దత్, పీవీపీ ఈ వేడుకలో చాలా చురుగ్గా వ్యవహరించారు. తమ బేనర్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘మహానటి’ సినిమాలకు మే 1న ఆడియో విడుదల చేసి 9న సినిమాను రిలీజ్ చేస్తే అద్భుత విజయం సాధించాయని, అదే కోవలో ‘మహర్షి’ కూడా చరిత్ర సృష్టిస్తుందని దత్ అన్నాడు.

పీవీపీ అయితే వంశీతో తనకు అసలు గొడవే లేదన్నట్లు మాట్లాడాడు. ‘ఊపిరి’ రిలీజ్‌కు రెండు రోజుల ముందు తనకు వంశీ ‘మహర్షి’ లైన్ చెప్పడం.. ఆ తర్వాత మహేష్ బాబుకు కథ వినిపించడం గురించి వెల్లడించాడు. తనే స్వయంగా ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను ఈ నెల 18న విజయవాడలో చేయాలని దిల్ రాజుకు చెప్పి ఒప్పించినట్లు కూడా పీవీపీ చెప్పాడు. ఇక రాజు ఏమో దత్, పీవీపీల సపోర్ట్ గురించి చాలా సానుకూలంగా మాట్లాడాడు. మొత్తానికి ‘మహర్షి’ ఈవెంట్ చూస్తే ఇన్నాళ్లు నిర్మాతల గొడవ గురించి వచ్చిన వార్తలన్నీ అబద్ధమేమో అన్న భావన కలిగింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English