సినిమా రిలీజ్ కాకముందే.. సక్సెస్ మీట్ డేట్ ఫిక్స్

సినిమా రిలీజ్ కాకముందే.. సక్సెస్ మీట్ డేట్ ఫిక్స్

అప్పట్లో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ అనే సినిమా రిలీజైతే.. ఆ రోజు సాయంత్రానికే శత దినోత్సవం ఫలానా చోట జరపబడును అంటూ ఒక ప్రకటన ఇచ్చి జనాలకు పెద్ద షాకిచ్చాడు వైవీఎస్ చౌదరి. ఐతే ఈ రోజుల్లో శతదినోత్సవాలు.. రజతోత్సవాలు లాంటివేమీ లేవు కాబట్టి అలాంటి అనౌన్స్‌మెంట్లకు ఆస్కారం లేదు. ఇప్పుడు రిలీజైన వారానికో రెండు వారాలకో సక్సెస్ మీట్‌లు పెడుతున్నారు. చిన్న, మీడియం రేంజి సినిమాలకు రిలీజ్ రోజు, తర్వాతి ఒకటి రెండు రోజుల్లో కూడా సక్సెస్ మీట్‌లు పెడుతుంటారు కానీ.. పెద్ద సినిమాలకు మాత్రం కొంచెం గ్యాప్ ఇస్తుంటారు. ఐతే సినిమా ఒక రేంజ్ సక్సెస్ అయితేనే ఇవి ఉంటాయి. కానీ ఇంకా రిలీజ్ కాని ఓ భారీ చిత్రానికి.. విడుదలైన తొమ్మిది రోజులకు సక్సెస్ మీట్ భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు ప్రకటించడం విశేషం. ఆ చిత్రం మరేదో కాదు.. మహర్షి.

మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘మహర్షి’కి 18వ తేదీన సక్సెస్ మీట్ నిర్వహిస్తారట. ఈ ఈవెంట్ ప్లానింగ్ మొత్తం ఇప్పటికే పూర్తి కూడా అయినట్లు ‘మహర్షి’ నిర్మాతల్లో ఒకరైన పీవీపీ చెప్పడం విశేషం. ఆయన సొంత సిటీ అయిన విజయవాడ వేదికగా సక్సెస్ మీట్ చేస్తారట. ‘మహర్షి’ మహేష్‌కు హీరోగా 25వ సినిమా కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారీ స్థాయిలోనే ఈవెంట్ ప్లాన్ చేశారట. ఇప్పటిదాకా మహేష్‌తో పని చేసిన దర్శకులందరినీ ఈ వేడుకకు పిలిచి సత్కరిస్తారట. నిజానికి ‘మహర్షి’ ప్రి రిలీజ్ ఈవెంట్‌నే ఈ తరహాలో చేయాలనుకున్నారు. కానీ ఎందుకో ఆ ఆలోచన పక్కకు వెళ్లిపోయింది. వెంకటేష్, విజయ్ దేవరకొండలను పిలిచి ఈవెంట్  కానిచ్చేశారు. ఐతే పీవీపీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తన సిటీలో సక్సెస్ మీట్‌ భారీ స్థాయిలో చేయడానికి ఏర్పాట్లు చేయిస్తున్నాడు. ఈ విషయం మహేష్‌కు కూడా తెలియదని ఆయన ప్రి రిలీజ్ ఈవెంట్లో చెప్పడం విశేషం. ఏదేమైనప్పటికీ ఈ స్థాయిలో సక్సెస్ మీట్ చేయబోతున్నట్లు ముందే ప్రకటించారంటే సినిమా ఫలితంపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English