మహేష్‌కు సోషల్ మీడియా పవర్ తెలిసొచ్చింది

మహేష్‌కు సోషల్ మీడియా పవర్ తెలిసొచ్చింది

‘మహర్షి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పెద్ద తప్పే చేసేశాడు మహేష్ బాబు. తన కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిన.. మరపురాని విజయాలందించిన సినిమాలు, వాటి దర్శకుల గురించి మాట్లాడుతూ.. అతి ముఖ్యమైన చిత్రాలన్నింటినీ ప్రస్తావించి ‘పోకిరి’ సంగతి మరిచిపోయాడు. దాని దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తావనే తేలేదు. మహేష్ నటించిన మిగతా అన్ని చిత్రాల కంటే ఇది పై భాగంలో ఉండాల్సినది. మహేష్ బాక్సాఫీస్ స్టామినాను అమాంతం పెంచి, అతడికి మాస్‌లో మాంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టి, ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందించిన సినిమా ఇది. అప్పటిదాకా చూసిన మహేష్ వేరు. ‘పోకిరి’లో చూసిన మహేష్ వేరు. అభిమానులకు మహేష్ ఇంతగా ఎమోషనల్ హై ఇచ్చిన సినిమా ఇంకేదీ కనిపించదు. అలాంటి సినిమాను, దాని దర్శకుడిని మహేష్ మరిచిపోవడం ఆశ్చర్యకరమైన విషయమే.

ఐతే ‘మహర్షి’ ఈవెంట్ ముగిసిన కాసేపటికే మహేష్ తన తప్పు దిద్దుకున్నాడు. ‘పోకిరి’ సంగతి మరిచిపోవడం పొరబాటని అంగీకరిస్తూ.. ఆ సినిమా తన కెరీర్లో ఎంత కీలకమో చెబుతూ ట్వీట్ చేశాడు. పూరి జగన్నాథ్‌కు థ్యాంక్స్ చెప్పాడు. చేసిన తప్పును ఒప్పుకుని ఇలా ట్వీట్ పెట్టడం ద్వారా మహేష్ తన హుందాతనాన్ని చాటుకున్నాడు. ఐతే మహేష్ మరీ ఇంత వేగంగా స్పందించడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. ఇక్కడే సోషల్ మీడియా పవర్ ఏంటన్నది తెలిసొచ్చింది. మహేష్ స్పీచ్ ముగియడం ఆలస్యం.. ‘పోకిరి’ని, పూరి జగన్నాథ్‌ను అతను మరిచిపోయిన విషయంపై సామాజిక మాధ్యమాల్లో గోల గోల జరిగిపోయింది. మహేష్‌ను తిట్టి పోస్తూ ట్వీట్లు వెల్లువెత్తాయి. మహేష్ ఫ్యాన్స్ సైతం ఈ విషయంలో నెగెటివ్‌గా స్పందించారు. అతను ఇలా ఎలా చేస్తాడంటూ ప్రశ్నలు సంధించారు. మహేష్ వీరాభిమానులు ఈ విషయాన్ని ఎలా డిఫెండ్ చేయాలో తెలియక సతమతం అయిపోయారు. మరి మహేష్ స్వయంగా విషయం తెలుసుకున్నాడా.. అతడికి ఎవరిైనా సమాచారం ఇచ్చారా అన్నది తెలియదు కానీ.. ఎక్కువ డ్యామేజ్, చర్చ జగరకుండా ట్వీట్ పెట్టి ఈ వివాదానికి తెరదించేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English