వంద కోట్లు ఈడ్చి అవతల కొట్టింది

వంద కోట్లు ఈడ్చి అవతల కొట్టింది

‘కాంఛన’ సిరీస్ అంటే చాలు.. ప్రేక్షకులంతా కలిసి వంద కోట్లు తీసి పక్కన పెట్టేస్తున్నట్లుగా ఉంది. ఈ సిరీస్‌లో వచ్చిన ‘కాంఛన’ అప్పట్లో సంచలన వసూళ్లు రాబట్టింది. స్టార్ హీరోల సినిమాలకు కూడా రూ.50 కోట్ల గ్రాస్ అనేది చాలా పెద్ద విషయంగా ఉన్నప్పుడు అలవోకగా ఆ క్లబ్బులోకి చేరింది. ఫుల్ రన్లో రూ.60-70 కోట్ల మధ్య గ్రాస్ వచ్చిందా చిత్రానికి.

ఇప్పటి లెక్కల్లో చూస్తే అది వంద కోట్లు కొల్లగొట్టినట్లే. ఇక తర్వాత వచ్చిన ‘గంగ’ సంగతి చెప్పాల్సిన పని లేదు. అది ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. ఐతే పై రెండు సినిమాలకు పాజిటివ్ టాకే వచ్చింది. రివ్యూలు కూడా సానుకూలంగానే ఉన్నాయి. కానీ ‘కాంఛన’ సిరీస్‌లో వచ్చిన కొత్త సినిమా ‘కాంఛన-3’కి మాత్రం పరిస్థితి ఏమంత సానుకూలంగా లేదు. కానీ ఈ చిత్రం కూడా వంద కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడం విశేషం.

తమిళ, తెలుగు భాషల్లో కలిపి విడుదలైన 11వ రోజు రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది ‘కాంఛన-3’. ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి పెద్దగా వసూళ్లు లేవు. కేవలం దేశీయ వసూళ్లతోనే ఇది వంద కోట్ల మార్కును అందుకోవడం విశేషం. ఇందులో తెలుగు వెర్షన్ వాటా రూ.30 కోట్లకు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 19న పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ‘కాంఛన-3’కి పూర్తిగా నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. చూసిన వాళ్లంతా సినిమాలో ఏం లేదన్నారు. రొటీన్ హార్రర్ కామెడీ అని పెదవి విరిచారు. కానీ మాస్ ప్రేక్షకులకు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

అటు తమిళంలో, ఇటు తెలుగులో బి, సి సెంటర్లలో ఈ చిత్రం దుమ్ము దులుపుతూ రెండో వారంలో కూడా మంచి వసూళ్లతో సాగిపోతోంది. ఈ ఏడాది దక్షిణాదిన రూ.100 కోట్ల క్లబ్బులో చేరిన ఐదో సినిమా ‘కాంఛన-3’ కావడం విశేషం. ‘పేట’, ‘విశ్వాసం’, ‘ఎఫ్-2’, ‘లూసిఫర్’ మాత్రమే ఈ మార్కును అందుకున్నాయి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English